*ఎస్పీ అనుచిత వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలి*
– ఎంపిపి ఎలక బిందు నరేందర్ రెడ్డి
మునగాల, సెప్టెంబర్ 17(జనంసాక్షి): జయహో జగదీశ్‌రెడ్డి మంత్రి గారికి.. మన ముందు తరానికి ఆయన ఒక గురువు. ఆయన మంత్రిగా ఉండడం మన అదృష్టం’’ ఇవి.. సూర్యాపేట జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ చేసిన వ్యాఖ్యలు. మొన్న శుక్రవారం తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవంలో భాగంగా సూర్యాపేటలో నిర్వహించిన సభలో ఎస్పీ ఈ వ్యాఖ్యలు దుమారం రేపిన విషయం విదితమే. అయితే దానికి నిరసనగా మునగాల మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొప్పుల జైపాల్ రెడ్డి నివాసంలో జరిగిన విలేకరుల సమావేశంలో మునగాల మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడారు. ఈ సందర్భంగా మునగాల మండల ఎంపిపీ ఎలక బిందు నరేందర్ రెడ్డి మాట్లాడుతూ, దాదాపు 10 వేల మందికి పైగా హాజరైన ఆ కార్యక్రమంలో సభికులందరితోనూ మంత్రి జగదీశ్‌రెడ్డికి జేజేలు కొట్టించడం ఆయన ఉన్నత ఉద్యోగ పదవికి మాయని మచ్చలాంటిదని ఆమె అన్నారు. ఒక ఐపీఎస్ అధికారి అయి ఉండి, పార్టీ కార్యకర్తలా, మంత్రికి అనుచరుడిలా నినాదాలు చేస్తూ తన స్థాయిని మరిచి ప్రవర్తించారని అన్నారు. ఇది విషయాన్ని మండల కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని ఆమె తెలిపారు. ఆయనపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కొలిశెట్టి బుచ్చిపాపయ్య, ఎంపిటిసి రజిత రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు ఎలక నరేందర్ రెడ్డి, కాసర్ల కోటయ్య, మండల నాయకులు మండవ చంద్రయ్య, భీమపొంగు శంకర్, కాసర్ల వెంకట్ తదితరులు పాల్గొన్నారు.
|