హైదరాబాద్: నల్గొండ జిల్లా జానకీపురం వద్ద జరిగిన ఎన్‌కౌంటర్ ఘటనలో గాయపడిన ఎస్‌ఐ సిద్దయ్య పరిస్థితి ఇంకా ఆందోళనకరంగానే ఉంది. నిన్న సుదీర్ఘంగా 8 గంటలపాటు శస్త్ర చికిత్స నిర్వహించి ఆయన శరీరం నుంచి 3 బుల్లెట్లు తీసినప్పటికీ మరో బుల్లెట్ తల భాగంలో ఉండిపోవడంతో ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉంచి వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. బీపీ సాధారణ స్థాయికి వచ్చిన తర్వాత ఇవాళ మరో మారు వైద్యుల బృందం శస్త్ర చికిత్స నిర్వహించే అవకాశముంది. రక్తపోటు స్థాయి ఎక్కువ ఉండడంతో నిన్న చికిత్స సమయంలో 40 యూనిట్ల రక్తాన్ని ఎక్కించాల్సి వచ్చింది. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని వైద్యుల బృందం నిర్ణయించింది. మరో వైపు ఇదే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఇన్స్‌పెక్టర్ బాలగంగిరెడ్డిను సాధారణ వార్డుకు మార్చి డిశ్చార్జి చేసే అవకాశముందని సమాచారం. మరో వైపు నల్గొండ జిల్లా కాల్పుల ఘటన తర్వాత రెండు తెలుగు రాష్గాల్లో పూర్తి స్థాయి అప్రమత్తత కొనసాగుతుంది. నిన్న ఎన్ కౌంటర్ లో హతమైన ముష్కరుల సహచరులను పట్టుకునేందుకు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ మేరకు రెండు రాష్ట్రల డీజీపీ కార్యాలయాలు ఆయా జిల్లా ఎస్పీలకు, పోలీస్ కమిషనర్ కార్యలయాలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశాయి. ఆయా పోలీస్ స్టేషన్‌ల స్థాయిలో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, తనిఖీల సమయంలో బుల్లెట్ ఫ్రతిప్ జాకెట్లు, ఆయుధాలు ధరించి ఉండాలని సూచనలు జారీచేశారు.




