ఏజెంట్‌ కోసం అఖిల్‌ భారీ కసరత్తులు

అక్కినేని వారి నవయువ కథానాయకుడు అఖిల్‌ తాజా చిత్రం ’ఏజెంట్‌’లో రెట్టించిన ఉత్సాహంతో నటిస్తున్నాడు. సురేంద్‌ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అఖిల్‌ యాక్షన్‌ పరంగా అభిమానుల్ని ఎంతగానో మెప్పిస్తాడని మేకర్స్‌ నమ్మకంగా చెబుతున్నారు. సీక్రెట్‌ స్పై గా కనిపించడానికి అఖిల్‌.. జిమ్‌లో గంటల తరబడి కసరత్తులు చేసి.. సిక్స్‌ ప్యాక్‌ బాడీని బిల్డ్‌ చేశాడు. ఈ సినిమా అనౌన్స్‌మెంట్‌ రోజున విడుదలైన పోస్టర్స్‌లోని అఖిల్‌ లుక్స్‌కు అభిమానులు తెగ ఫిదా అయిపోయారు. నిజానికి ఈ సినిమా పాన్‌ ఇండియా స్థాయిలో విడుదలవుతుందని ఇప్పటి వరకూ ప్రకటించలేదు. కానీ ఈ సినిమా టీజర్‌ విడుదల సందర్భంగా మేకర్స్‌ ఆ సందేహాన్ని తీర్చేశారు.’ఏజెంట్‌’ టీజర్‌ ను జూలై 15న విడుదల చేస్తున్నట్టు ప్రకటించిన సందర్బంలో అన్ని భాషల్లోనూ టీజర్‌ విడుదలవుతుందని తెలియచేశారు. తెలుగు మార్కెట్‌ తర్వాత ’ఏజెంట్‌’ ప్రచారం పూర్తిగా బాలీవుడ్‌లోనే ఉంటుందని కూడా అందులో స్పష్టమైంది. అఖిల్‌ తన కెరీర్‌ లోనే తొలిసారిగా నటిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం అవడమే కాకుండా.. ఈ సినిమాతో అతడు బాలీవుడ్‌ మార్కెట్‌ను కైవసం చేసుకొనే ప్రయత్నంలో ఉన్నాడని సమాచారం. టీజర్‌ విడుదలయ్యాకా.. భారతీయ ప్రేక్షకుల ఆరాధ్య హీరోగా అఖిల్‌ మారతాడని చెప్పుకోవచ్చు. ఇప్పటికే సినిమాపై పాజిటివ్‌ బజ్‌ నడుస్తోంది. హాలీవుడ్‌ సూపర్‌ హిట్‌ ’బార్న్‌’ సిరీస్‌ ఆధారంగా ఈ సినిమా కథాంశాన్ని తీర్చిదిద్దాడు వక్కంతం వంశీ. దేశ రహస్యాల్ని శత్రుదేశ గూఢచారులు దొంగిలించుకు పోతే.. అప్పుడు సీక్రెట్‌ ఏజెంట్‌ బరిలోకి దిగుతాడు. అప్పుడు జరిగే అనూహ్య పరిణామాల నేపథ్యంలో ఈ సినిమా కథాంశం సాగుతుంది. ఇక ఇందులో మలయాళ మెగాస్టార్‌ మమ్ముట్టి రిటైర్డ్‌ మేజర్‌ పాత్రలో నెగెటివ్‌ రోల్‌ చేయబోతున్నారు. పాన్‌ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ’ఏజెంట్‌’ విడుదల కాబోతున్నది.