Friday, 6 November 2026

ఒక్కో రైతుకు రూ.5 లక్షల బీమా 

హైదరాబాద్‌,మే22(జ‌నం సాక్షి): తెలంగాణ రాష్ట్రం సాగు నీటి పథకాలు చేపట్టి, రాష్ట్ర వ్యవసాయభివృద్ధికి గట్టి ప్రయత్నాలు చేస్తోంది. రాష్ట్ర బడ్జెట్‌లో సాగునీటి కోసం రూ.25 వేల కోట్లు, వ్యవసాయానికి రూ.12 వేల కోట్లు కేటాయించింది. రైతులకు ఎకరాకు ఖరీఫ్‌, రబీ కాలాల్లో రూ.4 వేలు చొప్పున  పెట్టుబడి నిస్తున్నారు. రైతు సమన్వయ సమితులను గ్రామ, మండల, జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసి మార్కెట్‌ ధరలు కనీస మద్దతు ధరల కన్నా తగ్గితే, ఈ సమితులు వ్యవసాయోత్పత్తులను సేకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సహాయపడుతుంది. ప్రతిరైతుకూ రూ.5 లక్షల మేర బీమా సౌకర్యం ప్రకటించి, అందుకు రూ.500 కోట్లు కేటాయించింది. వ్యవసాయ యంత్రాల సబ్సిడీకి రూ.520 కోట్లు, పాలీహౌస్‌లు, గ్రీన్‌హౌస్‌ల నిర్మాణానికి సబ్సీడి కింద రూ.120 కోట్లు, కోళ్ళపరిశ్రమ అభివృద్ధికి రూ.109 కోట్లు కేటాయించింది. వ్యవసాయం బహుముఖంగా అభివృద్ధి చెందడానికి అధికంగా నిధులిస్తున్న ఘనత తెలంగాణ రాష్ట్రానిదే.
————-