ఒక్క అవకాశం ఇవ్వండి రాజన్న రాజ్యాన్ని మరోసారి చూపిస్తా

-ఎల్లారెడ్డి ప్రజా ప్రస్థాన పాదయాత్రలో వైఎస్ ఆర్ టి పి అధ్యక్షురాలు షర్మిల

 

ఎల్లారెడ్డి,అక్టోబర్10 (జనం సాక్షి ) : గత ఎన్నికల్లో దళితున్ని ముఖ్యమంత్రి చేస్తానని మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ కు గద్దె దించాల్సిన సమయం ఆసన్నమైందని వైయస్సార్ టిపి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. సోమవారం కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండల పరిధిలో నీ లక్ష్మాపూర్ గ్రామం నుండి మొదలైన ప్రజాప్రస్థానం పాదయాత్ర హాజీపూర్ గ్రామం వరకు వచ్చి అక్కడ వైయస్సార్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఐదు గ్రామాల ప్రజలు ముందుకు వచ్చారు. విగ్రహాన్ని ఏర్పాటు చేయవద్దని పోలీసులు అన్నారు. ప్రజాబిప్రాయానికి భిన్నంగా వైఎస్ విగ్రహాన్ని ఏర్పాటుకు అడ్డుకున్నారు. విగ్రహం ఏర్పాటు చేయాలంటే ముందు అనుమతి తీసుకోవాలని పోలీసులు అన్నారు. రాజకీయ వత్తిళ్లతోనే విగ్రహం ఏర్పాటును పోలీసులు అడ్డుకున్నారని ఇప్పటికైనా హాజిపూర్ గ్రామంలో వైయస్సార్ విగ్రహం పెట్టి తీరుతామని వైఎస్ఆర్ బిడ్డగా మాట ఇస్తున్నాను ముఖ్య మంత్రి హోదా లో అయిన తర్వాత నేను ఇక్కడికి వచ్చి విగ్రహం పెట్టిస్తా, టిఆర్ఎస్ అంటే బందిపోట్ల రాజ్య సమితి , ఇక్కడ బందిపోట్ల రాజ్యమే నడుస్తుందని అన్నారు. జరిగిన ప్రజాప్రస్థాన పాద యాత్రలో ఆమె మాట్లాడారు. హాజీపూర్ గ్రామం నుండి రెడ్డి పట్టణం లోని అంబేద్కర్ చౌరస్తా నుండి బస్టాండ్ వరకు ప్రజాప్రస్థానం యాత్ర చేరుకుంది బస్టాండ్ వద్ద నిర్వహించిన బహిరంగ సభను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ టిఆర్ఎస్ పై నిప్పులు చెరిగారు. ముందుగా వైయస్సార్ సతీమణి, కడప ఎమ్మెల్యే వైయస్ విజయమ్మ మాట్లాడుతూ వైయస్ షర్మిల చేపట్టిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర నేటితో 2500 కిలోమీటర్లు పూర్తి చేసుకుందని, దీనికి అంతటికి మీ ప్రేమ అభిమానాలే కారణమన్నారు. షర్మిలమ్మ వైఎస్సార్ ముద్దుల బిడ్డ, వైఎస్సార్ కి ఒక యువరాణి
అని షర్మిలను అపురూపంగా వైఎస్సార్ పెంచుకున్నారని గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు మీకోసం షర్మిల పాదయాత్ర చేస్తు కష్టపడుతుంటే చాలా గర్వంగా అనిపిస్తుందన్నారు. కొంత జీవితాలకు అర్థం పరమార్థం ఉంటుందని, కొన్ని జన్మలకు సార్థకత ఉంటుందని,
తన జన్మకు ఒక సార్థకత ఉండాలని మీకు సేవ చేయాలని షర్మిల కంకణం కట్టుకుని గడప గడపకు వస్తుందని అన్నారు.
19 ఏళ్ల క్రితం వైఎస్సార్ చేసిన ప్రజా ప్రస్థానం ఒక చరిత్ర అని,
వైఎస్సార్ వేసిన ప్రతి అడుగు ప్రజా సంక్షేమానికి పరుగులు తీసిందనీ గుర్తు చేశారు. ఎక్కడ సమస్య ఉంటే అక్కడ షర్మిల ప్రత్యక్షం అవుతుందని, షర్మిల ఏ పోరాటం చేసినా మీకోసమే మీ జీవితాలు కోసమే అని విజయమ్మ అన్నారు. వైఎస్సార్ పాలన మీరు కోరుకుంటే ఆయన బిడ్డను ఆశీర్వదించండనీ కోరారు. సంక్షేమం, స్వయం సమృద్ది, సమన్యాయం కోసం వైఎస్సార్ తెలంగాణ పార్టీ పుట్టిందని తెలిపారు.

అనంతరం షర్మిల మాట్లాడుతూ 2500 కిలో మీటర్లుపాదయాత్ర పూర్తి చేసుకున్న అంటే మీ అభిమానమే,
నడిచింది నేనే అయినా నడిపించింది మీ అభిమానమే ఆమె అన్నారు. ఇదే ఎల్లారెడ్డి నియోజక వర్గంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ నాలుగు రోజులు పాదయాత్ర చేశారని, ఆరోజుల్లో సాగునీరు అందడం లేదని రైతులు వైఎస్సార్ దృష్టికి తీసుకు వచ్చారని గుర్తు చేశారు.
పోచారం ప్రాజెక్ట్ కాలువలు మరమత్తులు చేస్తే నీళ్ళు వస్తాయని అన్నారు. ఆ రోజు వైఎస్సార్ మాట ఇచ్చారు
ఆయన అధికారంలో వచ్చాక కాలువల మరమత్తులు చేయించారని ఇది వైయస్సార్ గొప్పతనం అన్నారు. ఆయన 20 వేల ఎకరాలకు నీళ్ళు ఇచ్చారని, 2008 లో బై ఎలక్షన్ లో ఎల్లారెడ్డి కి డిగ్రీ కాలేజీ ఇస్తామని మాట ఇచ్చి 20 రోజుల్లో ఇచ్చారన్నారు.
మోడల్ రెసిడెన్షియల్ కాలేజీ గా తీర్చి దిద్దారని, గాంధారి, పోతంగల్ బ్రిడ్జీలను కట్టారని తెలిపారు.
ఎన్నికల్లో కేసీఅర్ ఎన్నో హామీలు ఇచ్చాడని, ఈ నియోజక వర్గానికి 10 టీఎంసీ ల నీళ్ళు ఇస్తా అన్నారు ఇచ్చారా అని ప్రశ్నించారు.
చెరువుల మీద చెక్ డ్యాం లు అన్నారు కట్టారా? మంజీర నీళ్ళు అన్నారు ఇచ్చారా ?
ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ అన్నారు. ఇచ్చారా అని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని
పోచారం డ్యాం ఎత్తు పెంచుత అన్నారు..పెంచారా..? ఇక కేటీఆర్ ఇక్కడ ఇండోర్ స్టేడియం కడతాం అన్నారు ..కట్టారా..?
ఉర్దూ పాల్టెక్నిక్ కాలేజీ అన్నారు..ఇచ్చారా..? అని ఆమె ప్రశ్నించారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఏ పార్టీ అని, ఆయన తెరాస కాదు కదా కాంగ్రెస్ కదా
ఈయన ఒక జంప్ జిలానీ అని ఎద్దేవా చేశారు. ఈ నియోజక వర్గంలో అడుగు పెట్టగానే స్థానిక మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ 32 ఎకరాలు అసైన్డ్ భూమి కాజేశారు అని చెప్పారని అన్నారు. అలాంటి వాడి అరాచకాలు తట్టుకోలేక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ను గెలిపించారని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మళ్ళీ తెరాస పార్టీకే అమ్ముడు పోయారని ఇది రాజకీయం వ్యభిచారం కాదా అని ప్రశ్నించారు. ఈ నియోజక వర్గ ప్రజల అత్మ గౌరవం కేసీఅర్ చెప్పు కింద తాకట్టు పెట్టారని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీకి కర్రు కాల్చి వాత పెట్టాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ పాలనలో అన్ని వర్గాల వారు అసంతృప్తి ఆగ్రహంతో ఉన్నారని ధ్వజమెత్తారు. 78 రోజులుగా వీఆర్ఏలు ఆందోళన చేపడుతున్న ప్రభుత్వంలో కదలిక లేకపోవడం సిగ్గుచేటు అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 34 మంది వీఆర్ఏలు ఆత్మహత్య చేస్టున్న ప్రభుత్వంలో చలనం లేకపోవడం నిరంకుశానికి నిదర్శమని ఆమె పేర్కొన్నారు. వైయస్సార్ టీపికి ఒక అవకాశం కల్పిస్తే, రాజన్న పాలన చూపిస్తామని ఆమె ప్రజలను కోరారు.

అంతకుముందు ప్రజా కవి వైఎస్ఆర్ టిపి నేత ఏపూరి సోమన్న కళాజాత బృందం ఆలపించిన పాటలు సభికులను అలరించాయి.

ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ టిపి నేతలు ఏపూరి సోమన్న, బాలరాజు నీలం రమేష్ పెద్ద ఎత్తున మహిళలు పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.