Thursday, 5 November 2026

కంట్రిబ్యూటరీ పెన్షన్‌ పథకంపై యుద్దం

ఉమ్మడి పోరుకు సిద్దం అవుతున్న సంఘాలు

హైదరాబాద్‌,జూన్‌11(జ‌నం సాక్షి): పెన్షన్‌ పురుద్దరణకు ఎన్టీవోలు మరోమారు ఉద్యమించనున్నారు.రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు నష్టదాయకమైన కంట్రిబ్యూటరీ పింఛను పథకాన్ని (సీపీఎస్‌) ప్రభుత్వం రద్దుచేసే వరకు పోరాటం సాగిస్తామని ఉపాధ్యాయ సంఘాలు స్పష్టం చేశారు. 2004 తర్వాత ప్రభుత్వ ఉద్యోగాలు పొందినవారికి సీపీఎస్‌ విధానంవల్ల ఎంతో నష్టం వాటిల్లుతుందన్నారు. ఈ దృష్ట్యా సీపీఎస్‌ విధానాన్ని రద్దుచేసి పాతపింఛను విధానాన్ని కొనసాగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నారు. దీని కోసం అన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో కలిసి సంఘటిత పోరాటం సాగిస్తామని పేర్కొన్నారు. జిల్లాలోని ఉపాధ్యాయులపై పనిభారం పెంచేసి తనిఖీల పేరుతో సెస్పెన్షన్లు విధించడం మంచి పద్ధతికాదని, ఇలాంటి విధానాలను విద్యాశాఖ అధికారులు విరమించుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణలు ఇవ్వడంలో తప్పులేదుకానీ, సామర్థ్య పరీక్షలు నిర్వహించి గ్రేడింగులు ఇవ్వాలనుకోవడం సహేతుకం కాదని పేర్కొన్నారు. నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని విద్యారంగ అభివృద్ధికి వినియోగించడం మంచి పద్ధతే అయినప్పటికీ ఉపాధ్యా యులకు బోధనేతర విధులు అప్పగించడం సరికాదన్నారు. అవసరమైతే ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులకు సామర్థ్య పరీక్షలు నిర్వహించు కోవాలే తప్ప ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఇలాంటి పరీక్షల నిర్వహణ సరికాదన్నారు. సాంకేతికత పేరుతో ఉపాధ్యాయులకు పనిభారం పెంచితే బోధన కుంటుపడుతుందన్నారు. ప్రస్తుత విద్యాసంవత్సరం లో సీసీఈ విధానాన్ని అనుసరించడంవల్ల విద్యార్థులపై ఆర్థికభారం పడుతోందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న మండల, ఉపవిద్యాశాఖాధికారుల కొలువులు, డైట్‌ అధ్యాపకుల కొలువులు,జూనియర్‌ అధ్యాపకుల కొలువులు రెగ్యులర్‌ ప్రాతిపతికన భర్తీఅవుతాయని చెప్పారు. బీఈడీ, టెట్‌, డీఎస్సీ వంటి పరీక్షల్లో ఉత్తీర్ణులై ఉపాధ్యాయ వృత్తిలోకి ప్రవేశించినవారికి సామర్థ్య పరీక్షలు నిర్వహించడంలోప్రభుత్వ ఆంతర్యం ఏమిటో చెప్పాలన్నారు.