దుర్వ్యసనాలకు దూరంగా ఉంచే బాధ్యత యాజమాన్యాలదే
హైదరాబాద్,జూన్11(జనం సాక్షి): ఇటీవల మాదకద్రవ్యాలు, గంజాయి రవాణా కలకలం రేపుతోంది. అక్రమార్కులకు ఈజీగా ఆదాయం సమకూర్చే వ్యవహారంగా మారడంతో గంజాయి రవాణాలో ఇరు తెలుగు రాష్ట్రాల వారు ఉంటున్నారు. ఇటీవల గతంలో ఎన్నడూ లేనంతగా గంజాయి రవాణాపై పోలీసులు దాడులు చేసి కేసులు నమోదు చేస్తున్నారు. విద్యార్థులు,యువత లక్ష్యంగా కొన్ని ముఠాలు వారిని ముగ్గులోకి దింపుతున్నాయి. ఈ వ్యవహారంలో మైనర్లు గంజాయి తాగుతూ పోలీసులకు పట్టుబడుతున్న తీరు ఆందోళనకు గురిచేస్తోంది. ఇకపోతే కాలేజీల్లో అమాయక విద్యార్థులను బుట్టలో వేసుకుని డ్రగ్స్ అమ్మకాలు సాగించిన ఘటనలు గతంలో కలకలం రేపాయి. పిల్లలను దీనికి బానిసలుగా చేస్తే తమ వ్యాపారం సాగుతుందని వారి ఎత్తుగడ. సక్రమమైన దృష్టి,నిఘా లోపిస్తే తల్లిదండ్రులకు, టీచర్లకు సవాల్ లాంటిది. గొప్పలు చెప్పుకుంటున్న కారర్పోరేట్ స్కూళ్లలో ఇది వేల్లూనుకోవడం దారుణం కాక మరోటి కాదు. హైదరాబాద్ నగరంలో స్కూల్ విద్యార్థులు మొదలుకొని ఇంజనీరింగ్ విద్యార్థుల వరకూ… దీని ఉచ్చులో చిక్కుకుంటున్నారని వచ్చిన వార్తలు కలవరం కలిగిస్తున్నాయి. ఇంటర్నేషనల్ స్కూళ్లుగా చెప్పుకుంటున్న ప్రైవేటు విద్యా సంస్థల్లో ఇలాంటి ఘనకార్యాలు జరుగుతన్నా గుర్తించని అసమర్థ విధానాలు బట్టబయలు అయ్యాయి. అసలు తమ పిల్లలు ఏం చేస్తున్నారో తెలుసుకునే వీలు లేకుండా అటు యాజమాన్యాలు, టీచర్లు, తల్లిదండ్రులు ఉన్నారు. ప్రచారార్భాటాలకు నమ్మి పంపితే ఇటు పాఠశాలల్లోనూ విద్యార్థులకు రక్షణ ఉండదు. వ్యాపారాలు,ఉద్యోగాలతో తీరికలేకుండా గడుపుతున్న ఆధునిక సమాజపు తల్లిదండ్రలు తమ కన్నబిడ్డలు ఏం చదువుతున్నారో, ఎలాంటి నడవడికను అలవరుచుకుంటున్నారో ఓ కంట కనిపెట్టాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోలేక పోవడం వారు చేస్తున్న తప్పుగానే భావించాలి. తాము రోజూ తరగతి గదిలో చదువు చెప్పే పిల్లల తీరు ఎలా ఉంటున్నదో, ఏయే విషయాల్లో వారికి కౌన్సెలింగ్ అవసరమో టీచర్లు పసిగట్టలేక లేకపోతున్నారు. విద్యార్థులతో ఆ టీచర్లకు స్నేహపూర్వక సంబంధాలుంటే చాలావరకు సమస్యలు దూరం చేయవచ్చని అంటున్నారు.సంపన్న కుటుంబాల్లో పాకెట్ మనీ పేరిట, వాహనాలకయ్యే పెట్రోల్ కోసమని ఇస్తున్న డబ్బులు మత్తు పదార్థాలకు వినియోగించుకుంటున్నారు. ప్రభుత్వాలుగానీ, విద్యాసంస్థలుగానీ, తల్లిదండ్రులుగానీ ఎంత అప్రమత్తంగా ఉంటే తప్ప దుర్వ్యసనాల నుంచి పిల్లను దూరంగా ఉంచలేం.




