Tuesday, 3 November 2026

కరక్కాయ కేసును ఛేదించిన పోలీసులు

– కేసులో కీలక నిందితుడు మల్లిఖార్జున్‌ అరెస్ట్‌
– రూ. 44లక్షలను స్వాధీనం చేసుకున్న పోలీసులు
హైదరాబాద్‌, ఆగస్టు4 (జ‌నం సాక్షి) : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన కరక్కాయ కేసును సైబరాబాద్‌ పోలీసులు చేధించారు. ప్రత్యేక బృంధాలతో గాలింపు చర్యలు చేపట్టిన పోలీస్‌శాఖ కరక్కాయల పొడి పేరుతో కోట్లు కొట్టేసిన గ్యాంగ్‌ పట్టుబడింది. ఈ స్కాంలో కీలక నిందితుడు మల్లిఖార్జున్‌తో పాటు ముగ్గురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి వద్ద నుంచి రూ.44లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించింది. దాదాపు 15 రోజులుగా వివిధ ప్రాంతాల్లో సోదాలు నిర్వహించిన ప్రత్యేక బృందం కీలక నిందితుడు మల్లిఖార్జున సహా ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. కరక్కాయలు తీసుకుని పొడి చేసి ఇస్తే వెయ్యికి రూ.300 ఎక్కువగా ఇస్తామంటూ స్కాంను ప్రారంభించి దాదాపు రూ.10కోట్ల వరకు వసూలు చేసి పరారయ్యారు. పెద్ద సంఖ్యలో బాధితులు ఈ స్కాంలో ఉన్నారు. దీంతో ప్రత్యేక దృష్టి సారించిన పోలీసులు ఎట్టకేలకు కీలక నిందితుడిని అరెస్ట్‌ చేశారు. కేసు వివరాలను పోలీసులు వెల్లడించనున్నారు.