– దేశంలో ఇలాంటి ప్రత్యేక ఫోర్స్ ఉన్నది ఒక్క జీహెచ్‌ఎంసీలోనే
– తెలంగాణ పోలీస్‌శాఖ దేశానికే ఆదర్శంగా నిలుస్తుంది
– నగరాన్ని సేఫ్ సిటీగా మార్చేందుకు మరో లక్ష కెమెరాలు ఏర్పాటు
– నగరాన్ని అన్నింటిల్లో ముందుంచేందుకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద చూపుతుంది
– రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్
– డిజాస్టర్ రెస్క్యూ ఫోర్స్ ప్రారంభించిన మంత్రి
హైదరాబాద్, ఆగస్టు4(జనం సాక్షి) : హైదరాబాద్ మహానగరంలో విపత్తులు, ప్రమాదాలు సంభవించినప్పుడు అప్రమత్తమై ప్రమాదశాతాన్ని తగ్గించేందుకు ప్రత్యేక దళం సహాయ చర్యలు చేపడుతుందని, ఇలాంటి డిజాస్టర్ రెస్క్యూ ఫోర్స్ దేశంలో ఎక్కడా లేదని తొలిసారిగా మన నగరంలో ఏర్పాటు చేసినట్లు ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. శనివారం డిజాస్టర్ రెస్క్యూ ఫోర్స్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించి ప్రసంగించారు. దేశంలో ఇలాంటి ప్రత్యేక ఫోర్స్ ఉన్న పాలక సంస్థ జీహెచ్‌ఎంసీ మాత్రమే అన్నారు. విపత్తులను ఎదుర్కొనేందుకు జీహెచ్‌ఎంసీ ఎప్పుడూ సిద్ధంగా ఉందన్నారు. ఈ నగరాన్ని అన్నింట్లో ముందుంచేందుకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపెడుతోంది. నగరాన్ని సేఫ్ సిటీగా మార్చేందుకు మరో లక్ష కెమెరాలను ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. ఇప్పటికే లక్ష కెమెరాలు ఏర్పాటు చేశామని తెలిపారు. ఏ నగరంలోనైనా అనుకోని, ఆకస్మిక సంఘటనలు జరిగినప్పుడు ఆ నగరం మున్సిపల్ కార్పొరేషన్ కీలక బాధ్యత ఉంటుందన్నారు. వెంటనే స్పందించటం, వెంటనే స్పందించి నష్టనివారణ చర్యలు చేపట్టడం వంటి చర్యలు చేపట్టాల్సి ఉంటుందన్నారు. జీహెచ్‌ఎంసీ, మున్సిపల్ అధికారుల బాధ్యత, ఒకవైపు పోలీస్, ఫైర్, రెవెన్యూ సిబ్బందితో అందరినీ సమన్వయం చేసుకొని ముందుకు నడవాల్సిన బాధ్యత ఉంటుందని మంత్రి తెలిపారు. అందులో తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయ హైదరాబాద్ మహానగరం రాష్ట్రం యొక్క 45 నుంచి 50 వరకు స్థూల ఆదాయం ఈ నగరం నుంచే
వస్తుందన్నారు. ఈ నగరాన్ని అన్ని రకాలుగా పూర్తిస్థాయిలో సురక్షితంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. రాష్ట్రం ఏర్పాటు అనంతరం కేసీఆర్ ఆధ్వర్యంలో కైం రేటును గణనీయంగా తగ్గిందని, ఈ విషయంలో తెలంగాణ పోలీస్‌కు దేశవ్యాప్తంగా గుర్తింపు వస్తుందన్నారు. ఎంహెచ్‌ఏ వారు విడుదల చేసిన నివేదికలో దేశం మొత్తంలోనే అద్భుతంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందని గుర్తించటం జరిగిందన్నారు. నగరాన్ని సేఫ్ సిటీగా మార్చే క్రమంలో 10లక్షల సీసీ కెమేరాలు పెట్టాలని నిర్ణయించామన్నారు. ఇప్పటికే ప్రజల సహకారంతో 4లక్షల కెమెరాలను ఏర్పాటు చేసుకోవటం జరిగిందన్నారు. సీసీ కెమెరాలతో అనేక కేసుల చేధన తేలిక అవుతుందన్నారు. నాలుగేళ్లలో ఖాజాగూడలో నిర్మాణంలో ఉన్న భవనం కూలిపోయి 8మంది కూలీలు మరణించిన సంఘటన తనను చాలా బాధించిందన్నారు. 36గంటలు తనంతో పాటు సిబ్బంది అక్కడే ఉండి మృతదేహాలను బయటకు తీయటం జరిగిందన్నారు. అప్పుడు అనుకున్న విధంగా నగరంలో డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఉండాలని నిర్ణయించామన్నారు. ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి 128మందికి శిక్షణ అందించి హైదరాబాద్ నగర ప్రజలకు ఎలాంటి ఉపద్రవం, సమస్యలు వచ్చినా వెంటనే సంఘటన స్థలంకు చేరుకొని అటు పోలీస్, రెవెన్యూ, ఫైర్ అధికారులతో సమన్వయ పర్చుకొని ప్రజల్లో మరింత విశ్వాసాన్ని పెంచేలా ఈ దళం ఉపయోగపడుతుందని కేటీఆర్ పేర్కొన్నారు. దేశంలో ఏ నగరంలో జరగని అభివృద్ధిని హైదరాబాద్ జీహెచ్‌ఎంసీ చేపడుతుందన్నారు. జీహెచ్‌ఎంసీ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకారం అందించాలని కేటీఆర్ కోరారు. ఈ కార్యక్రమంలో మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, డిప్యూటీ మేయర్ పషీయుద్దిన్ బాబా, స్థానిక కార్పొరేటర్ విజయారెడ్డి, జీఎహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి, హైదరాబాద్ పోలీస్ కవిూషనర్ అంజనీకుమార్ సిన్హా, హెచ్‌ఎండీఏ కమిషనర్ చిరంజీవులు తదితరులు పాల్గొన్నారు.
నాఫిస్ ఫోటో ఎగ్జిబిషన్‌ను సందర్శించిన మంత్రి కేటీఆర్..
మస్కులర్ డిస్టోఫ్రీ అనే వ్యాధితో బాధపడుతున్న షేక్ నాఫిస్ అనేక చిత్రకారిణి ఫోటో ఎగ్జిబిషన్ ను మంత్రి కేటీ రామారావు శనివారం సందర్శించారు. రవీంద్రభారతిలోని ఫోటో ఎగ్జిబిషన్ హాల్లో 50 చిత్రాలతో నాఫిస్ తన ప్రదర్శన కొనసాగిస్తున్నారు. అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఆమెకి ప్రభుత్వం తరఫున అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని మంత్రి తెలిపారు. తక్షణం పేద కళాకారులకు అందించే పెన్షన్ సౌకర్యాన్ని కల్పించాలని మామిడి హరికృష్ణతో మాట్లాడారు. నాఫిస్ కి అవసరమైన వైద్య సహకారాన్ని నిమ్స్ వైద్యులతో అందిస్తామని మంత్రి ప్రకటించారు. రాష్ట్రంలోని పలువురు ప్రముఖుల చిత్రపటాలతో పాటు దేశవిదేశాలలో పేరుప్రఖ్యాతులు పొందిన పలువురి చిత్రాలను నాఫిస్ చిత్రీకరించారు. అరుదైన వ్యాధి ఉన్నప్పటికీ మొక్కవోని ధైర్యంతో తన చిత్రకళను కొనసాగిస్తున్న నాఫిస్ కి మంత్రి అభినందనలు తెలిపారు. నాఫిస్ మంత్రి కేటీ రామారావుకు ఆయన స్వీయ చిత్రాన్ని బహుకరించారు.
విపత్తు సమయాల్లో ‘ప్రత్యేక దళం’




