– రెండు బృందాలు నిందితుల కోసం పోలీసుల గాలింపు
– కూకట్‌పల్లి స్టేషన్‌కు తరలివచ్చిన పెద్దసంఖ్యలో బాధితులు
– తమకు న్యాయం చేయాలని పోలీసులకు విజ్ఞప్తి
హైదరాబాద్, జులై17(జనం సాక్షి) : కరక్కాయ స్కాంలో మోసానికి పాల్పడిన నిందితులను గుర్తించేందుకు సైబరాబాద్ పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. మంగళవారం దర్యాప్తు చేపట్టిన పోలీసులు కంపెనీలో పనిచేస్తున్న సిబ్బందిని సీపీ కార్యాలయానికి తరలించి విచారణ చేశారు. రెండు బృందాలుగా ఏర్పడి నెల్లూరు ప్రాంతంలో పోలీసులు నిందితుడికోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇదిలా ఉంటే మంగళవారం ఉదయం బాధితులు పెద్ద సంఖ్యలో కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్ వద్దకు తరలివచ్చి ఆందోళన నిర్వహించారు. వెయ్యి డిపాజిట్ చేస్తే కిలో కరక్కాయలు ఇస్తామని, వాటిని పొడి చేసి తెస్తే రూ. 1300 వందలు చెల్లిస్తామని తమ వద్ద లక్షలు కట్టించుకున్నాడని, ఇప్పుడు మోసం చేసి పరారయ్యాడని తమకు న్యాయం చేయాలని పోలీసులకు మొరపెట్టకున్నారు. దీంతో బాదితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వివరాల్లోకి వెళితే.. కేపీహెచ్‌బీ రోడ్ నంబర్-1, ఎంఐజీ 1-165 చిరునామాలో సాఫ్ట్ ఇంటిగ్రేట్ మల్టీ టూల్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎస్‌ఐఎం టీ) పేరిట కంపెనీ ప్రారంభమైంది. దీనికి ఏపీలోని నెల్లూరుకు చెందిన ముప్పాల మల్లికార్జున అనే వ్యక్తి మేనేజర్‌గా వ్యవహరించాడు. ఈ కంపెనీ కరక్కాయల పొడి వ్యాపారం పేరుతో మార్చిలో ఓ టీవీలో ప్రకటనను విడుదల చేసింది. రూ. వెయ్యి డిపాజిట్ చేసి కిలో కరక్కాయలను తీసుకెళ్లాలని, దాన్ని పౌడర్‌గా మార్చి తీసుకొస్తే రూ. 1,300 చెల్లిస్తామని ప్రచారం చేసింది. దీంతో పెద్ద ఎత్తున వినియోగదారులను ఆకర్షించిన తర్వాత కంపెనీ వ్యూహం మార్చింది. పెద్ద ఎత్తున డిపాజిట్లు సేకరించాలనే లక్ష్యంతో.. ఒక్కసారిగా రూ.లక్ష డిపాజిట్ చేసి 100 కిలోల కరక్కాయలను కొనుగోలు చేసి, పొడి చేసి ఇస్తే కిలోకు అదనంగా రూ.50 కవిూషన్ చెల్లిస్తామని నమ్మబలికింది. ఈ ప్రకటనను నమ్మిన బాధితులు లక్షలు చెల్లించి కర్కాయలు కొనుగోలు చేశారు. ఈ ఒప్పందాల ప్రకారం ఆ సంస్థ సోమవారం వినియోగదారుల నుంచి పొడి తీసుకొని, డిపాజిట్‌కు కవిూషన్ కలిపి చెల్లించాల్సి ఉన్నది. పొడిని అందించేందుకు కంపెనీ కార్యాలయం వద్దకు వెళ్లారు. మల్లికార్జున మోసం చేశాడని తెలుసుకున్న బాధితులు పెద్ద ఎత్తున కార్యాలయం వద్దకు చేరుకొని ఆందోళన చేపట్టారు. అనంతరం కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.




