హైదరాబాద్,మే21(జనం సాక్షి): కర్ణాటక రాజకీయ పరిణామాలపై ఎన్నికల సంఘం మాజీ చీఫ్ టీఎస్ కృష్ణమూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు ఎవరికీ స్పష్టమైన మెజారిటీ కట్టబెట్టనందున… అక్కడ రాష్ట్రపతి పాలన విధించడమే మంచిదన్నారు. కర్ణాటకలో నెలకొన్న పరిస్థితుల వల్ల అక్కడ ప్రభుత్వం ఏర్పాటు కాని పక్షంలో… రాష్ట్రపతి పాలన విధించడమే మంచిది…’ అని కృష్ణమూర్తి వ్యాఖ్యానించారు. బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ సహా మూడు పార్టీలూ మెజారిటీ సాధించడంలో విఫలమైనందున గవర్నర్ వాజుభాయ్ వాలా మూడు నెలల పాటు రాష్ట్రపతి పాలన విధించి ఉండాల్సిందని అన్నారు. ఈ గడువులోగా ఏ ప్రభుత్వమూ ఏర్పాటు కాకపోతే.. అప్పుడు అసెంబ్లీని రద్దు చేసి కొత్తగా ఎన్నికలు నిర్వహించ వచ్చునన్నారు. రాష్ట్రపతి పాలనే పరిష్కారం అని నేను చెప్పడం లేదు. కాని సమయం, డబ్బు వృధా కాకుండా, బేరసారాలు వంటివి జరగకుండా ఇది తప్పించగలిగి ఉండేది.. అని ఆయన పేర్కొన్నారు.




