Tuesday, 3 November 2026

కర్నాటక తరహాలో విత్తనబంతులు

భారీగా అమలుకు అటవీశాఖ కసరత్తు

హైదరాబాద్‌,జూన్‌30(జ‌నం సాక్షి): పచ్చదనాన్ని పెంపొందించడానికి ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమంలో ఈ యేడాది కూడా విత్తన బంతులు ప్రధాన భూమిక పోషించనున్నాయి. గతేడాది కర్నాటకలో విజయవంతమైన ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున్న అమలు చేయబోతున్నారు. ఇందులోభాగంగా విత్తన బంతులు చల్లేందుకు అనువైన అటవీ ప్రాంతాలను జిల్లా అటవీ శాఖ అధికారులు గుర్తిస్తున్నారు. దీంతో పెద్ద ఎత్తున మొక్కలను పెంచాలని నిర్ణయించారు. ఇందులో కొండలు, గుట్టలున్న ప్రాంతాలను అటవీ అధికారులు ఎంపిక చేయాల్సి ఉంది. నిజామాబాద్‌ జిల్లా మంచిప్ప, ఇందల్‌వాయి, వర్ని, మల్లారం, సారంగపూర్‌, బాడ్సి ఇలా గుట్టలున్న బ్లాక్‌ల్లో బంతులను విసరనున్నారు. సాధారణంగా మొక్కలు పెంచడం ఖర్చుతో కూడుకున్న పని. బ్యాగులు, మట్టి, విత్తనాలు, నర్సరీల ఎంపిక ఇలా చాలా ఖర్చుతో కూడుకున్న పని. అదే విత్తనబంతులు అనేది చాలా తక్కువ ఖర్చుతో చేయవచ్చని అటవీ అధికారులు చెబుతున్నారు. ఒక మొక్క పెంచడానికి సుమారు రూ.6 వరకు ఖర్చు అవుతుంది. అదే విత్తన బంతికి ఖర్చు రూపాయికి మిచ్చదని చెబుతున్నారు. తక్కువ ఖర్చుతో మొక్కల పెంపకానికి విత్తన బంతులు ఉపయోగపడతాయని అంటున్నారు. విత్తన బంతులు తయారచేసే విధానం కొత్తగా శ్రీకారం చుట్టామని ఎఫ్‌డీవో రేణుబాబు అన్నారు. డివిజన్‌కు లక్ష బంతులు తయారు చేయిస్తున్నాం. తక్కువ ఖర్చుతో విత్తన బంతులు తయారు చేయవచ్చు. విత్తన బంతులు గుట్ట ప్రాంతాల్లో చల్లడంతో వర్షానికి తడిసి పోయిన పడిన చోట విత్తనం మొలకెత్తడానికి వీలుంటుంది. ఈ పద్ధతి ఇప్పటికే కర్ణాటక రాష్ట్రంలో అమలు చేస్తున్నారని అన్నారు. వీటిని ఇప్పటికే జిల్లాలో అటవీ శాఖ సిబ్బంది లక్ష్యం మేరకు తయారు చేస్తున్నారు. ఈ విధానం ద్వారా మంచి ఫలితాలు కనిపిస్తే వచ్చే ఏడాది హరితహారంలో విత్తన బంతులకు ప్రాధాన్యం మరింతగా పెరుగుతుందని అన్నారు. ఏటా జులైలో మొక్కలు నాటే కార్యక్రమం చేపడతారు. ఇందుకు గాను అవసరమయ్యే మొక్కలు నర్సరీల్లో అందుబాటులో ఉంచారు. అయితే ఈ ఏడాది వినూత్నంగా విత్తన బంతికి శ్రీకారం చుట్టారు. విత్తన బంతులను తయారు చేసి అటవీ ప్రాంతాల్లో చల్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాలోని రెండు డివిజన్లలో 80 మంది అటవీ సిబ్బందితో వీటిని తయారు చేయిస్తున్నారు.వీటిని గుట్టలు, ఖాళీ స్థలాల్లో చల్లడానికి వినియోగిస్తారు. నిజామాబాద్‌ డివిజన్‌లో లక్ష, ఆర్మూర్‌ డివిజన్‌లో లక్ష చొప్పున బంతులు తయారు చేయాలని లక్ష్యం నిర్ణయిచారు. ఈ మేరకు 80 మంది అటవీ శాఖ సిబ్బంది వీటిని తయారీలో నిమగ్నమయ్యారు. విత్తనబంతుల వల్ల వర్షం కురిసిన సమయంలో మట్టి తడిసిపోయి తేమ ద్వారా విత్తనం మొలకెత్తి మొక్కగా పెరుగుతుందని అటవీ అధికారులు చెబుతున్నారు.