అధికారులకు మంత్రి జోగు సూచన
హైదరాబాద్,జూన్30(జనం సాక్షి): హరితహారంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావడంతో పాటు జిల్లాల్లో పచ్చదనాన్ని పచ్చగా పరిరక్షించుకోవాలని అటవీశాఖ మంత్రి జోగురామన్న కోరారు. ఇందులో భాగంగా నాటిన ప్రతి మొక్కకూ లెక్క ఉండాలని స్పష్టం చేశారు. నాటిన మొక్కలు ఏ స్థాయిలో ఉన్నాయి.. వాటి పెరుగుదల, సంరక్షణ వంటి వివరాలను అధికారులు ఎప్పుటికప్పుడు పరిశీలించాలని జిల్లా అధికారయంత్రాంగానికి సూచించారు. ఖాళీ ప్రదేశాలు, చెరువులు, కుంటలు, కట్టలు, రోడ్లకు ఇరువైపులా, శ్మశానవాటికలు, డంపింగ్‌యార్డులు తదితర చోట్ల వివిధ శాఖల ఆధ్వర్యంలో నాటినవాటి వివరాలు అంద జేయాలని ఆదేశించారు. వివిధ శాఖల ద్వారా నాటి సంరక్షించిన వాటి వివరాలు అందజేయాలన్నారు. గ్రామ హరితరక్షణ కమిటీ సహకారంతో వివరాలను సేకరించాలని పేర్కొన్నారు. నాలుగో విడత హరితహారం కార్యక్రమానికి అటవీశాఖ అధికారులు సిద్ధం కావాలని ఆదేశించారు. ప్రజలకు కోరుకున్నమొక్కలను అందజేయాలని సూచించారు. హరితహారంలో రాష్ట్రాన్ని ఆదర్శంగా నిలిపేందుకు అటవీ శాఖ అధికారులు కృషి చేయాలన్నారు. ప్రస్తుతం నర్సరీల్లో ఎన్ని మొక్కలున్నాయి? ఇంకెన్ని మొక్కలు అవసరం అన్న ప్రణాళికను తయారు చేస్తే మరిన్ని మొక్కలను కొనుగోలు చేస్తామని తెలిపారు. అడవులను పెంచేందుకు అడవుల్లో సీడ్ బాంబింగ్ ద్వారా ప్రయోగాత్మకంగా కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. ప్రతిశాఖ ద్వారా సీడ్బాళ్లను తయారు చేయించేందుకు ప్రణాళికను తయారు చేయాలని సూచించారు. హరితహారంలో నాటిన మొక్కలు.. పెరిగిన వాటి వివరాలను అందుబాటులో ఉంచాలన్నారు. పచ్చదనం పెంపొందిం చడంలో సమష్టిగా కృషిచేయాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. హరితహారంపై అలసత్వం వహించే అధికారులను ఇంటికి పంపిస్తామని మంత్రి జోగురామన్న హెచ్చరించారు. జులైలో మూడో విడత హరితహారం కార్యక్రమం ప్రారంభం కానుందన్నారు. ఈ నేపథ్యంలో గత ఏడాది నాటిన మొక్కలు ఎంత వరకు బతికి ఉన్నాయనే వివరాలను అధికారులు సేకరించి పెట్టుకోవాలన్నారు. ప్రతి శాఖ ద్వారా నాటిన మొక్కల ప్రదేశాలకు అధికారులు వెళ్లి పరిశీలించి నివేదికను తయారు చేసి వెంట తీసుకురావాలని సూచించారు. లేని పక్షంలో అధికారులపై వేటు తప్పదని హెచ్చరించారు. గత ఏడాది నాటిన మొక్కల వివరాలు, ఎంత వరకు నాటుకున్నాయనే సమాచారం లేక పోవడంతో ముందుకు వెళ్లలేమని అన్నారు. ఆయా స్థలాల్లో ఎన్ని మొక్కలు నాటుతారో ఆ స్థలాల ఎంపికను చేసి యాక్షన్ ప్లాన్‌ను రెడీ చేసి ఇవ్వాలన్నారు.
——




