Tuesday, 3 November 2026

విలక్షణ ప్రతిభాశాలి నటుడు ప్రభాకర్‌ రెడ్డి

జూలై1 ఆయన జయంతి సందర్భంగా

హైదరాబాద్‌,జూన్‌30(జ‌నం సాక్షి): తెలంగాణలో ఎందరో కళాకారులు, నటులు ఉన్నా ఉమ్మడి ఎపిలో ఎందుకనో వారికి పెద్దగ ఆప్రాముఖ్యత దక్కలేదు. కేవలం ఒకవర్గం చేతిలో సినిమా ఇమిడిపోయింది. ఆర్థిక వనరులు కూడా కారణం కావచ్చు. కాంతారావు లాంటి వారు హీరోగా రాణించినా ఆర్థికంగా నిలదొక్కోలేకపోయారు. ఆనాడు ఉన్న పరిస్థితుల్లో తనకంటూ ప్రత్యేకతను ఏర్పరచుకుని నిలదొక్కుకుని రాణించిన గర్వించదగ్గ నటుడు, దర్శక, నిర్మాత డా. ఎం. ప్రభాకర్‌ రెడ్డి. ఆయన మంచి కథకుడు కూడా. విలన్‌గా వేసినా, క్యారెటక్టర్‌ రోల్‌ వేసినా పాత్రలో ఒదిగి పోయారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడకుదగ్గరలో ఉన్న తుంగతుర్తి గ్రామంలో మందడి లక్ష్మారెడ్డి, కౌసల్య దంపతులకు 1936 జూలై 1న జన్మించారు. వ్యవసాయ కుటుంబంలో పుట్టి పెరిగిన ప్రభాకర్‌ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎం.బి.బి.ఎస్‌ పట్టా పొందారు. కానీ వైద్య వృత్తిలోనే కొనసాగడం ఇష్టం లేని కారణంగా దానిని చివరి వరకూ కొనసాగించలేక పోయారు. చిన్నప్పటి నుండి నాటకాలపై ఉన్న పిచ్చి ఆయన సినిమాల్లో చేరేలా చేసింది. అయితే ఆయన సంకల్పం సిద్దించి సినిమాలో తిరుగులేని నటుడిగా రాణించారు. ఏ పాత్రచేసినా అందులో ఒదిగిపోయారు. వందలాది చిత్రాలలో తండ్రిగా, తాతగా, మామగా, అన్నగా, స్నేహితుడిగా పాత్రలు పోషించి మెప్పించారు. విలన్‌ వేషాలతో మెప్పించిన చిత్రాలనేకం. ఎన్టీఆర్‌, కృష్ణ, శోభన్‌బాబు, కృష్ణంరాజు, చిరంజీవి వరకు హీరోలను ఢీకొనగలిగిన విలన్‌ ఆయనే. పలు చిత్రాలకు ప్రభాకర్‌ రెడ్డి దర్శకత్వం వహించారు. సుమారు 21 చిత్రాలకు కథలు సమకూర్చారు. భీష్మలో శంతనుడిగా, దానవీర శూరకర్ణలో ధర్మరాజుగా, శ్రీకృష్ణార్జున యుద్ధంలో శివుడుగా, నర్తనశాలలో కర్ణుడుగా నటించి పౌరాణిక పాత్రల పోషణలోనూ తన పర్సనాల్టీ, వాచకం, హావ భావాలు చక్కగా సరిపోతాయని నిరూపించుకున్నారు.నిజాం వ్యతిరేక పోరాటాలు చాలా ఉధృతంగా జరుగుతున్న రోజుల్లో ప్రభాకర్‌ రెడ్డి ప్రజాకళల పట్ల మొగ్గు చూపారు. బుర్రకథలు చెప్పడంలో మేటి అయినాడు. 1961లో ఉప్పునూతల పురుషోత్తం రెడ్డి ప్రోత్సాహంతో రామినీడు దర్శకత్వంలో నిర్మించిన ‘చివరకు మిగిలేది’ చిత్రం ద్వారా ఆయన సినీరంగ ప్రవేశం చేశారు. ఆయన నటించిన తొలిచిత్రంలో డాక్టర్‌ పాత్రే రావడం విశేషం. దానినే ఆయన అనేక సందర్భాలలో చెప్పేవారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఏది తలపెట్టినా ప్రభాకర్‌ రెడ్డి పట్టుదలతో కృషి చేసి అందుకు నిరంతరం శ్రమించేవారు. ఆయన చిత్రం పండంటి కాపురం జాతీయ ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. కథకుడుగా ఎన్నో చిత్రలకు కథలను సమకూర్చారు. ప్రభాకర్‌ రెడ్డి నిర్మాతగా రూపొందిన పచ్చని సంసారం, పండంటి కాపురం, గాంధీ పుట్టిన దేశం, మాకు స్వతంత్రం వచ్చింది, ధర్మాత్ముడు, గృహ ప్రవేశం, కార్తీకదీపం ఆయనకు బాగా పేరు తెచ్చిపెట్టాయి. ఆ చిత్రాలు సాధించిన ఘన విజయం చిత్ర ప్రముఖుల్లో కలవరం లేపాయి. చక్కటి కుటుంబ కథా చిత్రాలను నిర్మించి అన్ని వర్గాల ప్రేక్షకులకూ ఆయన చేరువయ్యారు. హైదరాబాద్‌లో 4 వేల మంది సినీ పరిశ్రమ కళాకారుల కోసం 57 ఎకరాల్లో ఇండ్లు కట్టించిన ఘనత ప్రభాకర్‌ రెడ్డికే దక్కింది. సినీ పరిశ్రమలో తెలంగాణ కళాకారులు అనాదిగా వివక్షకు గురవుతున్నారు. అందుకే ఆర్థికంగా నిలదొక్కుకోలేక పోయారు. అలాంటి కళాకారులకు ప్రభాకర్‌ రెడ్డి చేయూత నిచ్చారు. తాను నమ్మిన సిద్ధాంతం కోసం ఆయన నిరంతరం పోరాటం సాగించారు. ఎందరో హీరోలను సృష్టించిన క్యారక్టర్‌ ఆయనది. సినీ పరిశ్రమలో రెండు పూటలా తిండి దొరక్క అలమటించే వృద్ధ కళాకారుల సంక్షేమం కోసం ప్రజాసేవ చేయాలని తలంచి నటనకు స్వస్తి చెప్పారు. తెలంగాణతల్లి ఒడిలో జన్మించిన అరుదైన కళాకారుడు ప్రభాకర్‌ రెడ్డి. ఆయన విపత్కర పరిస్థితుల్లో నెగ్గుకుని వచ్చి తన సత్తా చాటారు.