సీఎఫ్‌ఏ బ్రోకరేజ్, లాబీయింగ్ కంపెనీ
డాక్యుమెంట్లను విూడియా ముందుంచిన ఉత్తమ్
హైదరాబాద్,ఆగస్టు30 : కర్షకరత్న పేరుతో సీఎం కేసీరా తప్పుడు ప్రచారం చేసుకోవడం సిగ్గు చేటని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. బుధవారం గాంధీ భవన్ లో విూడియాతో మాట్లాడుతూ తప్పుడు సర్వేలు, బోగస్ అవార్డులు కేసీఆర్ సొంతమని విమర్శించారు. ఈ బోగస్ అవార్డుపై ఎం.ఎస్. స్వామినాథన్ కు లేఖ రాస్తానని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. ఐసీఎఫ్‌ఏకు సంబంధించిన తప్పుడు పత్రాలని విూడియాకు వివరించారు. ఐసీఎఫ్‌ఏ ఒక బ్రోకరేజ్, లాబీయింగ్ కంపెనీ అని అన్నారు. అలాగే ఐసీఎఫ్‌ఏ చైర్మన్ ఎంజే ఖాన్ లాబీయిస్ట్ అని అన్నారు. ఇక ఐసీఎఫ్‌ఏ కు సంబంధించిన బోగస్ డాక్యుమెంట్లను జతపరిచి సీఎం కేసీఆర్ కు లేఖ రాస్తానని తెలిపారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ కు ప్రకటించిన బోగస్ అవార్డును గుర్తించకుండా విూడియా ప్రచురించడం సరైనది కాదన్నారు. అలాగే సీఎం కేసీఆర్ కు గవర్నర్ అభినందనలు తెలపడం దారుణమన్నారు. డబ్బుల కోసం ఇచ్చే అవార్డుకు గవర్నర్ అభినందనలు ఎలా తెలుపుతారని ఉత్తమ్ ప్రశ్నించారు. రైతులకు మద్దతు ధర ఇవ్వనందుకా అవార్డు..?
రుణమాఫీ ని పూర్తిగా అమలు చేయనందుకా…? వడ్డీ బాధ్యత నాదే అని మాట తప్పినందుకా..? అని ప్రశ్నించారు. అవార్డుతో కేసీఆర్ సమాజాన్ని తప్పుదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు. ఇక జీవో 39 పూర్తిగా అప్రజా అప్రజాస్వామికమని ఆయన అన్నారు. రైతుల ఆత్మహత్యల్లో రాష్ట్రం నెంబర్ 2 అని ఉత్తమ్ చెప్పారు.
ఎన్నికల కోసమే రైతు సమన్వయ సమితిలు
తెలంగాణకు కేసీఆర్ పాలన శాపంగా మారిందన్నారు. ఎన్నికల కోసమే టీఆర్‌ఎస్ సర్కార్ రైతు సమన్వయ సమితిలు తెరవిూదికి తెచ్చిందని మండిపడ్డారు. రైతు సమితిలు, భూ సర్వే లను రాజకీయలకు అతీతంగా ఉండాలని సూచించారు. రైతు సమితులను టీఆర్‌ఎస్ పార్టీ నామినేటెడ్ బాడీలుగా చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. పారదర్శకంగా ఉండాలంటే వెంటనే అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.




