అటవీ శాఖ అనుమతులపై సమన్వయ సమావేశం
అటవీ అనుమతుల ద్వారా సకాలంలో ప్రాజెక్టుల పూర్తికి సహకారం
కేంద్ర అటవీ పర్యావరణ శాఖ ప్రాంతీయ అధికారి రామ్ గోపాల్
హైదరాబాద్,ఆగస్టు30 : అనుమతుల కోసం నెలలు, సంవత్సరాల తరబడి ఆలస్యం చేస్తే ఆ ప్రాజెక్టుల ప్రయోజనం చేకూరదని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ ప్రాంతీయ అధికారి రామ్ గోపాల్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ది సథకాలు సకాలంలో పూర్తి అయితే ప్రజలందరికీ మేలు జరుగుతుందని ఆయన చెప్పారు. బుధవారం హైదరాబాద్ అరణ్య భవన్ లో వివిధ రకాల ప్రభుత్వ ప్రాజెక్టులు, అటవీ అనుమతుల తాజా స్థితిపై సవిూక్షా సమావేశం జరిగింది. కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ ప్రాంతీయ అధికారి రామ్ గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమన్వయ సమావేశంలో సంబంధిత శాఖల అధికారులు, అటవీ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వివిధ పథకాలు, వాటికి అటవీ భూముల్లో అనుమతులు, వాటి కోసం అటవీ శాఖతో సహా,ఆయా శాఖలు తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించారు. రోడ్లు- భవనాలు, విద్యుత్, సింగరేణి, సాగు నీటి ప్రాజెక్టులు, జాతీయ రహదారులు, గిరిజన అభివృద్ది, పంచాయితీ రాజ్ శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన పనులపై చర్చించారు. ఇప్పటిదాకా ఈ శాఖలకు సంబంధించి 179 పనులకు మొదటి విడత అనుమతులు వచ్చినా, తదుపరి చేపట్టాల్సిన చర్యల్లో తీవ్ర జాప్యం వల్ల తుది దశ అనుమతులు నిలిచిపోయాయి. డిపార్ట్ మెంట్ల వారీగా సవిూక్ష తర్వాత మూడు నెలల్లో అన్ని పనులూ పూర్తి చేసి, తుది అనుమతులకు నివేదికలు పంపుతామని యూజర్ ఏజెన్సీలు సమావేశంలో స్పష్టం చేశాయి. సెప్టెంబర్ నెలాఖరులో మరో సారి అనుమతుల పురోగతిపై సవిూక్షిస్తామని ఉన్నతాధికారులు వెల్లడించారు. సాగునీటి ప్రాజెక్టులతో పాటు మిషన్ భగీరథ, రోడ్లు, విద్యుత్ ఎ/-లాంట్ల నిర్మాణ పథకాలను ముఖ్యమంత్రి నిరంతరం సవిూక్షిస్తున్నారని, పర్యావరణ అనుమతుల కోసం నిరంతరం కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నారని అధికారులు తెలిపారు. అందుకే అభివృద్దిలో పురోగమిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ దేశ వ్యాప్తంగా మన్ననలు అందుకుంటోందన్నారు. చిన్న చిన్న కారణాలతో అనుమతుల్లో జాప్యం జరగటం వల్ల ప్రాజెక్టుల అనుకున్న లక్ష్యం నెరవేరదని, ప్రజలకూ ఆ ఫలాలు అందవని రామ్
గోపాల్ రెడ్డి చెప్పారు. క్షేత్ర స్థాయిలో అటవీ అధికారులు కూడా తమ పరిధిలో సొంతగా నిర్ణయం తీసుకోవటం, సంబంధిత శాఖలతో సంప్రందింపులు, టెక్నాలజీ ద్వారా ఆన్ లైన్ లో అనుమతులను ఫాలో అప్ చేయటం ద్వారా జాప్యాన్ని నివారించవచ్చన్నారు. తెలంగాణ ఇప్పటికే 263 ప్రాజెక్టుల పనులకు రెండో దశ అనుమతులు సాధించిందని ఇందులో రోడ్లకు సంబంధించిన పనులు 51,
ఇరిగేషన్ 46, విద్యుత్ 27, మిషన్ భగీరథ 11 పనులు ఉన్నట్లు వెల్లడించారు. తెలంగాణ ఏర్పాటైన మూడేళ్లలోనే 37 ప్రాజెక్టులకు ప్రభుత్వం తుది అటవీ, పర్యావరణ అనుమతులు కేంద్రం నుంచి సాధించటం గొప్ప విషయమని, అందుకే ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు, అటవీ శాఖ మంత్రి జోగు రామన్నలు అటవీ శాఖ పనితీరును ప్రశంసించారని ప్రధాన అటవీ సంరక్షణ అధికారి పీ.కె. ఝా వెల్లడించారు.ఈ సమావేశంలో ప్రధాన అటవీ సంరక్షణ అధికారి పీకే ఝా, అదనపు అటవీ సంరక్షణ అధికారి ఆర్. శోభ, అన్ని జిల్లాలకు చెందిన అటవీ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.




