Tuesday, 3 November 2026

కలసి రాని మార్కెట్‌ విధానం

అమలుకాని నిర్ణయాలు
హైదరాబాద్‌,మే8(జ‌నం సాక్షి): రైతులకు ఈ ఏడాది కలిసి రాలేదు. రైతులకు అన్ని దశల్లోనూ నష్టాలే ఎదురు కావడంతో చివరకు వ్యవసాయం సంక్షోభంలో పడే దుర్భర పరిస్థితి తలెత్తుతోంది. ఈ యేడాది ఏ పంట చేతికొచ్చినా రైతులకు కన్నీరు పెట్టించింది. మిర్చి,కంది, ఇప్పుడు వరి వంతు రానుంది. కష్టాలు తీరుస్తుందనుకొన్న ధాన్యం కుమిలిపోయేలా చేస్తోంది. రోజురోజుకు తగ్గుతున్న ధరలతో అన్నదాతలు  కుదేలవుతున్నారు.. మార్కెట్‌ మాయాజాలంతో తీవ్ర నష్టాలు మూటగట్టుకుంటున్నారు.దళారుల చేతిలో దగా పడుతున్నా ఆదుకునేవారు లేకుండా పోయారు. కొందరు వ్యాపారులు సిండికేట్‌గా మారి
అన్నదాతలను నిలువునా ముంచుతున్నా వారికి అండగా నిలబడ్డవారులేరు. ఇటీవలి పరిస్థితులు గమనిస్తే ఖమ్మం,మహబూబాబాద్‌, వరంగల్‌ అర్బన్‌, జనగామ, వరంగల్‌ రూరల్‌, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని వ్యవసాయ మార్కెట్లలోనూ ఇలాంటి పరిస్థితే ఉంది.  మార్కెటింగ్‌ శాఖ చోద్యం చూస్తోందే తప్ప రైతులకు అండగా నిలవలేదు. పొరుగు రాష్టాలైన్ర కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు మార్కెటింగ్‌ వ్యవస్థను పటిష్ఠపరిచి రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించడంలో సఫలీకృతమవుతున్నాయి.  దీని వల్ల పారదర్శకత పెరిగి పేద రైతుల పంటలకు మంచి ధరలు లభిస్తున్నాయి. మహారాష్ట్ర మార్కెటింగ్‌ విధానంలోనూ సంస్కరణలు వస్తున్నాయి. మహారాష్ట్ర స్టేట్‌ అగ్రికల్చర్‌ మార్కెటింగ్‌ బోర్డు రైతులు, సహకార సంఘాలను, వ్యాపారులందరినీ సమన్వయ పరిచి మంచి ధరలు లభించేలా చర్యలు తీసుకొంటోంది. ఇలా మార్కెటింగ్‌ శాఖ చొరవతో రైతులు లాభ పడుతున్నారు. గుజరాత్‌, హర్యాణా లాంటి రాష్ట్రాల్లోనూ  పండించిన పంటలకు మంచి ధర వచ్చేలా ప్రభుత్వాలు చొరవ చూపుతున్నాయి. మన దగ్గరా ప్రత్యేక చొరవతో సంస్కరణలు తేవాల్సి ఉంది. ఎనుమాముల, కేసముద్రం, మహబూబాబాద్‌, జనగామ మార్కెట్లలో  ప్రధానంగా మిర్చి, కందులు, పత్తి, పసుపు, ఇతర పంటల క్రయవిక్రయాలు పెద్ద మొత్తంలో జరుగుతాయి.
ఈ నాలుగు చోట్ల ఈసారి రైతులు తీవ్రంగా నష్టపోయారు. సరైన ధరలు రాక నిండా మునగడానికి ఈ మార్కెట్లలో ధరలు నిర్ణయించేది వ్యాపారులే కావడం గుర్తించాలి. ముందుగానే ఎవరు ఎంత సరకును ఎంత ధరకు కొనాలని నిర్ణయించుకొంటున్నారు. ప్రభుత్వం మిర్చికి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడానికి చొరవ చూపడం లేదు. అనధికారికంగా మాత్రం మార్కెటింగ్‌ యంత్రాంగం వ్యాపారులకు వంత పాడుతూ రైతులను ఇబ్బందులకు గురిచేస్తోంది. దీనిని అధిగమించేందుకు ఇతర రాష్ట్రాల విధానం అవలంబించాలని, అందుకు అధ్యయనం చేయాలని కోరుతున్నారు. తర్వాత పాటను ఇష్టమున్న ధరకు పాడడంతో దిక్కతోచని పరిస్థితిలో అమ్ముకుని వెళ్లాల్సి వస్తోంది.  ఇక్కడ తక్కువ ధరకు కొంటున్న వ్యాపారులు బయట ఎప్పటి ధరకే విక్రయిస్తున్నారు. మొదట పండించిన రైతులు నష్టాలకే అమ్ముతుండగా, అంతిమంగా వినియోగదారులూ అధిక ధరలకే సరకును కొంటున్నారు. ఎనుమాముల లాంటి కొన్ని మార్కెట్లలో వ్యాపారులే కాకుండా పెద్ద మొత్తంలో కవిూషన్‌ ఏజెంట్లూ లాభాలు మూటగట్టుకుంటున్నారు. ధరలు లేకపోవడం, కూలీ ధరలు అధికంగా ఉండడంతో  పెద్ద మొత్తంలో రైతులు మిర్చిని కోయకుండానే తోటలోనే వదిలేస్తున్నారు. కోసినా కనీసం కూలి ధర కూడా దక్కదనే భావనతో ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అలాగే ఉంచేస్తున్నారు.