ఆర్‌బిఐ పాత్ర నామమాత్రంతో వసూళ్లకు అడ్డంకులు
నిరర్థక ఆస్తుల సమస్యతో కుదేలవుతున్న వ్యవస్థ
ముంబై,మే8(జనం సాక్షి): మొండి బకాయిలు పేరుకుపోయిన దశలో పెద్దనోట్ల రద్దు బ్యాంకులకు కలసి వచ్చింది. భారీగా నగదు నిల్వలు వచ్చి పడ్డాయి. కోట్ల రూపాయిలు డిపాజిట్ అయ్యాయి. దీనికితోడి వేసిన డబ్బును తీసుకునేందుకు సవాలక్ష ఆంక్షలు ఉండడంతో ఆ డబ్బంతా బ్యాంకుల్లో ఉండిపోయింది. కేంద్ర ప్రభుత్వం గత ఏడాది నవంబరులో రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేసింది. ఈ నిర్ణయం బ్యాంకులకు నిధుల లభ్యత పెరిగేందుకు దోహదపడింది. రద్దయిన పాత నోట్లు బ్యాంకుల్లో డిపాజిట్ కాగా, వాటికి తిరిగి వెనక్కి తీసుకోవటంలో ఆంక్షలు ఉన్నందున ఆ సొమ్ము చాలా కాలం బ్యాంకుల వద్దే ఉండిపోయింది.
అయితే ఇవేవీ బ్యాంకులను ఎక్కువ కాలం ఉండనీయలేదు. బ్యాంకులను మోసం చేసిన కేఉలు ఎక్కువ కావడంతో పాటు, బ్యాంకుల్లో నిల్వలపై ఆంక్షలు రావడంతో వినయోగదారులు తమ డబ్బులను మెల్లగా వాపస్ తీసుకుంటూ వచ్చారు. అలాగే మళ్లీ బ్యాంకుల మొహం చూడడం లేదు. బ్యాంకులకు వెళ్లాలంటేనే భయపడే దుస్థితి వచ్చింది. దీంతో బ్యాంకులకు సొమ్ములు చేరడం లేదు. కేంద్ర ప్రభుత్వం డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహిస్తున్నందున సొమ్ము నగదు రూపంలోతగ్గి బ్యాంకుల వద్ద ఎక్కువగా ఉండే అవకాశం ఏర్పడింది. ఈ పరిస్థితి కూడా బ్యాంకులకు కలసి రావడం లేదున. మొండి బకాయిల వసూళ్ల విషయంలో ఇంతకాలం నాన్చివేత ధోరణి కొనసాగింది. గత ఏడాది సెప్టెంబరు నాటికి దేశీయ బ్యాంకింగ్ వ్యవస్థలో రూ.6.7 లక్షల కోట్ల నిరర్థక ఆస్తులు ఉన్నాయి. ఆర్థిక సర్వే ప్రకారం 2016 సెప్టెంబరు నాటికి ప్రభుత్వ రంగ బ్యాంకులు ఇచ్చిన రుణాల్లో స్థూల నిరర్థక ఆస్తులు 12 శాతం వరకూ ఉండటం గమనార్హం. కనీసం 15 ప్రభుత్వ రంగ బ్యాంకులకు స్థూల నిరర్థక ఆస్తులు 10 శాతం కంటే అధికంగా ఉన్నాయి. బాకీల సమస్య ప్రైవేటు బ్యాంకులతో పోలిస్తే ప్రభుత్వ రంగ బ్యాంకులకే అధికంగా ఉంది. ప్రైవేటు రంగ బ్యాంకుల్లో ఐసీఐసీఐ బ్యాంకుకు మొండిబాకీల భారం అధికం. దీనికి స్థూల నిరర్థక ఆస్తులు దాదాపు 7
శాతం కాగా తదుపరి స్ధానాల్లో యాక్సిస్ బ్యాంకు, ధనలక్ష్మీ బ్యాంకు ఉన్నాయి. ఇచ్చిన అప్పులు తిరిగి రాని పరిస్థితుల్లో కొత్తగా అప్పులు ఇచ్చేందుకు బ్యాంకులకు వీలు కావటం లేదు. నిరర్థక ఆస్తుల భారాన్ని తగ్గించుకోవటానికి బ్యాంకులు ఇప్పటివరకూ గట్టి ప్రయత్నాలు చేయటం లేదనే ఆరోపణలున్నాయి.
తీసుకున్న అప్పులను కార్పొరేట్ సంస్థలు తిరిగి చెల్లించకపోవటమే ఈ పరిస్థితికి ప్రధాన కారణం. ప్రధానంగా స్టీలు, విద్యుత్తు, రహదార్ల నిర్మాణ సంస్థలు, టెక్స్‌టైల్ సంస్థలు అప్పలు తిరిగి చెల్లించటం లేదు. దాదాపు 100 సంస్థల నుంచి వసూలు కావలసి సొమ్ము మొత్తం మొండిబకాయిల్లో సగానికి పైగా ఉండటం గమనార్హం. నీరవ్ మోడీ తదితరులు బ్యాంకులను ముంచిన తరవాత ఒక్కొక్కటిగా ఎగవేత వ్యవహారాలు బయటపడ్డాయి. చట్టపరంగా ఉన్న అవరోధాలు కొన్ని అయితే, కేసులు- విచారణల భయం దీనికి కారణాలుగా భావిస్తున్నారు. ఇచ్చినఅప్పులు తిరిగి రాకపోతే అందుకు అప్పులిచ్చిన బ్యాంకు అధికార్లు, సిబ్బందిని బాధ్యులను చేసే విధానం బ్యాంకింగ్ వ్యవస్థలో ఉంది. సీబీఐ కేసులు, కాగ్ , సీవీసీ విచారణల భయం సరేసరి. అందుకే తెగేదాకా లాగకుండా మొండిబాకీల కొన్ని బ్యాంకులు కాలం గడుపుతూ వస్తున్నాయి. మొండి బాకీలను అవి తమ ఖాతా పుస్తకాల్లో గుర్తించటం లేదు. మొండి బాకీల సమస్య నుంచి ఎంతోకాలం తప్పించుకోలేని స్థితిలో బ్యాంకింగ్ రంగం ఉంది. అందుకే ఈ సమస్యను సత్వరం పరిష్కరించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీకి ముందుకు వచ్చింది. తాజాగా కేంద్ర ప్రభుత్వం జారీచేసిన ఆర్డినెన్స్‌తో ఆర్‌బీఐకి కొన్ని ప్రత్యేక అధికారాలు లభిస్తున్నాయి. నిరర్థక ఆస్తుల విషయంలో సరికొత్త నిర్ణయాలు తీసుకునే అవకాశం దీనివల్ల లభిస్తోంది. ఏదైనా బ్యాంకు మొండిబాకీల విషయంలో విూనమేషాలు లెక్కిస్తుంటే, ఆర్‌బీఐ నేరుగా రంగంలోకి దిగేందుకు వీలుకలుగుతోంది. అన్నింటికీ ఒకే విధానం కాకుండా బ్యాంకును బట్టి, దానికి ఉన్న మొండిబాకీ ఖాతాలను బట్టి విడివిడిగా విధాన నిర్ణయాలు అమలు చేయటానికి వీలుకలుగుతుంది. అందువల్ల మొండి బాకీల విషయంలో ఎంతోకొంత మార్పు కనిపిస్తుందని అంచనావేస్తున్నారు. ఇన్ని ఉన్నప్పటికీ మొండి బాకీలు బ్యాంకింగ్ రంగానికి సమస్యాత్మకంగా ఉన్నాయి. న్యాయస్థానాలు, డీఆర్‌టీలో సత్వరం వివాదాలు పరిష్కారం కాకపోవటం, సర్ఫేసీ చట్టం కింద స్వాధీన పరచుకున్న ఆస్తులను విక్రయించలేకపోవటం, ఇతరత్రా సమస్యలు దీనికి కారణాలు.




