Thursday, 5 November 2026

కస్తూర్బాలో ఇంటర్‌ విద్య

కడియం చొరవతో ఫలిస్తున్న ప్రయత్నాలు

హైదరాబాద్‌,జూలై18(జ‌నం సాక్షి): అనాథ బాలికలు కొందరు… ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో బడి మానేసిన అమ్మాయిలు ఇంకొందరు…అలాంటి అభ్యాగులను కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు అక్కున చేర్చుకొని విద్యను అందిస్తున్నాయి. వాటిని బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. కేజీబీవీలలో ఇంటర్మీడియట్‌ విద్యను కొనసాగించడం..ఆంగ్లమాధ్యమంలో పాఠాలు చెప్పేందుకు సన్నాహాలు చేయడం కలసి వస్తోంది. వీటిని బలోపేతం చేయడంలో డిప్యూటి సిఎం కడియం శ్రీహరి గట్టిగా చేస్తున్న కృషి ఫలిస్తోంది. ఎన్నో అవాంతరాలను అధిగమించి కేజీబీవీలలో పదో తరగతి పూర్తిచేసిన బాలికలు ఇంటర్మీడియట్‌ చదువలేకపోతున్నారు. వారిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దేందుకు ఈ చర్య తీసుకుంటున్నారు. కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలల్లో 6,7,8 తరగతులను కేందప్రభుత్వం నిర్వహిస్తుంది. ఆయా తరగతుల బాలికల విద్యాబోధనకు అయ్యేఖర్చు, వసతి నిర్వహణ భారం పూర్తిగా కేంద్రమే భరిస్తుంది. 10 తరగతులను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. అయితే వచ్చే విద్యాసంవత్సరం నుంచి 9, 10 తరగతులను కూడా కేంద్రం నిర్వహిస్తే ఇంటర్మీడియట్‌

చదువు భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని కేంద్రానికి పంపిన నివేదికలో పొందుపరిచారు.

కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల్లో ప్రస్తుతం తెలుగు మాధ్యమంలోనే బోధన కొనసాగుతోంది. మారుతున్న కాలానికి అనుగుణంగా ఆంగ్లమాధ్యమంలో పాఠశాలు చెప్పేందుకు నిర్ణయించారు. మొదటగా ఆరో తరగతిలో ఆంగ్లమాధ్యమాన్ని ప్రవేశపెట్టి క్రమక్రమంగా మిగిలిన తరగతులకు అప్‌గ్రేడ్‌ చేయాలని నిర్ణయించారు. కేజీబీవీలలో ఆంగ్లమాధ్యమం, ఇంటర్మీడియట్‌ విద్యను అమలు చేయడం వల్ల బాలికలకు మంచి భవిష్యత్తు ఉంటుంది. గ్రావిూణ ప్రాంత విద్యార్థినులు ఉన్నత విద్యను చదవడానికి అవకాశం దొరుకుతుంది. చదువుతోపాటు పాటు వృత్తివిద్యా కోర్సుల్లో కూడా శిక్షణ ఇస్తుండటం వల్ల ఆశించిన లక్ష్యం నెరవేరు తుంది.అయితే కేజీబీవీలలో పది పూర్తయిన 65శాతం మంది బాలికలు ఉన్నత విద్యకు వెళ్లడం లేదని సర్వేలో తేలింది. విషయమై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించి. క్షేత్రస్థాయి అధ్యయనం చేసింది. కేజీబీవీల్లో ఇంటర్మీడియట్‌ను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది.