రంగంలోకి దిగిన చాందీ
రాహుల్ ఆదేశాలతో తెలుగు రాష్ట్రాల్లో పావులు కదుపుతున్న నేతలు
హైదరాబాద్,జూలై2(జనం సాక్షి): రాష్ట్ర విభజనతో జీవచ్ఛవంలా మారిన కాంగ్రెస్‌కు జవసత్వాలు సమకూర్చటానికి అధిష్ఠానం గట్టిగా ప్రయత్నిస్తోంది. రాహుల్ కాంగ్రెస్ అధ్యక్ష పీఠం అధిష్టించిన తరవాతఆయా రాష్ట్రాల పరిస్తితులను పరిశీలన చేస్తున్నారు. ఇందులో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో పాతకాపునలు పిలిపించి వారికి పార్టీలో మళ్లీ గౌరవానికి భంగం వాటిల్లకుండా పెద్దపీట వేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో రానున్న కాలంలో పార్టీని మరింత బలోపేతం చేసి ముందుకు నడిపించే శక్తిమంతమైన నేతలు అవసరమని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఊమెన్ చాందీ ‘మన ఇంటికి వచ్చేయండి’ పేరుతో ఓ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇటీవల ఢిల్లీలో రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో రాహుల్ గాంధీ సమావేశ మయ్యారు. పార్టీ బలోపేతం కావాలంటే స్థానిక ప్రభుత్వాలపై పోరాడుతూనే కొత్తగా పాతనేతలను మళ్లీ పార్టీలోకి రప్పించాలని, వారిలో విశ్వాసం పెంచాలని సూచించారు. ఇందులో బాగంగానే తెలంగాణలో డిఎస్‌కు, ఎపిలో కిరణ్ కుమార్ రెడ్డి, ఉండవల్లి లాంటి నేతలను దగ్గరకు తీసుకోవాలని చూస్తున్నారు. అలాగే ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోన్న పాలకపక్షం వైఫల్యాపై విమర్శనాస్త్రాలు సంధించడంతో పాటు వాటిని ప్రజల్లోకి తీసుకుని వెళ్లేలా ప్లాన్ చేస్తున్నారు. ఇందుకోసం పార్టీని వీడిన ముఖ్య నేతలు మళ్లీ కాంగ్రెస్ గూటికి వచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు. ఎపికి సంబంధించి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఊమెన్ చాందీ రంగంలోకి దిగారు. ఇందులో భాగంగా పార్టీకి పూర్వ వైభవం తీసుకుని వచ్చే క్రమంలో పాతతరం నేతలను కలుస్తున్నారు. ఊమెన్ చాందీ రంగంలోకి దిగారు. ఆదివారంనాడు హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డితో సమావేశమయ్యారు. ఆ తరువాత తన చిరకాల మిత్రుడు, కాంగ్రెస్ కురువృద్ధుడు, మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య నివాసానికి వెళ్లారు. సీనియర్ నేతగా, కాంగ్రెస్ వాదిగా పార్టీ బలోపేతానికి సలహాలివ్వాలని ఊమెన్ కోరడంతో రోశయ్య సరేనన్నారు. అనంతరం మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డితోనూ ఊమెన్ భేటీ అయ్యారు. కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి రావాలంటూ ఆహ్వానించారు. అయితే కిరణ్ తన నిర్ణయాన్ని వెల్లడించలేదు. సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటానని ఊమెన్‌కు చెప్పినట్లు సమాచారం. పార్టీ అధ్యక్షుడు రాహుల్ ఆదేశాల మేరకు పార్టీని వీడినవారందరినీ వెనక్కు రప్పించే ప్రయత్నం ముమ్మరంగా చేస్తున్నామని చాందీ అన్నారు. మాజీ ఎంపీ హర్షకుమార్‌తో కూడా సంప్రదింపులు జరుపుతున్నానని వివరించారు. కేంద్రం ఇచ్చిన విభజన హావిూల అమలుకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని, కేంద్రంలో తాము అధికారంలోకి వచ్చిన వెంటనే వాటి అమలుకు తొలి ప్రాధాన్యం ఇస్తామని ఊమెన్ చాందీ స్పష్టం చేశారు. ఏపీలో కాంగ్రెస్ బలోపేతం కోసం నవంబరు 20లోపు సమగ్ర కార్యచరణను రూపొందిస్తామన్నారు. ఇక తెలంగాణకు సంబందించి ఇక్కడి నేతలు చర్యలు తీసుకుంటారని అంటున్నారు. అయితే చాలామంది కాంగ్రెస్‌ను వీడి టిడిపి, వైకాపల్లో చేరారు. కొందరు బిజెపిలో ఉన్నారు. ఆరంతా వస్తారా లేదా అన్నది చూడాలి.
—–




