Wednesday, 4 November 2026

కాళేశ్వరం పనుల్లో పురోగతి

విజయవంతంగా 400 కేవీ సబ్‌స్టేషన్‌ ఛార్జింగ్‌ పక్రియ
అధికారులను అభినందించిన మంత్రి హరీష్‌ రావు
హైదరాబాద్‌,మే7(జ‌నం సాక్షి):  ఉత్తర తెలంగాణ వర ప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టు పనుల్లో మరో పురోగతిని సాధించారు. ఎనిమిదో ప్యాకేజీకి సంబంధించి 400 కేవీ సబ్‌స్టేషన్‌ ఛార్జింగ్‌ పక్రియను నీటిపారుదల, విద్యుత్‌ శాఖ అధికారులు విజయవంతం చేశారు. ప్రాజెక్టులో భాగంగా ఛార్జింగ్‌ను పూర్తి చేసుకున్న మొదటి సబ్‌ స్టేషన్‌ ఇదే. ఇలాంటి సబ్‌స్టేషన్లు మరో నాలుగు ఉన్నాయి. దీంతో పనుల్లో శీఘ్రత కనిపిస్తోంది. ఈ సందర్భంగా నీటిపారుదల, విద్యుత్‌ శాఖ అధికారులను నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు అభినందించారు. ఇదే స్ఫూర్తితో మిగతా సబ్‌స్టేషన్ల పనులు, ఛార్జింగ్‌ పక్రియ పూర్తి చేయాలన్నారు. కాళేశ్రం విషయంలో ముందు నుంచి అధికారులు చిత్తశుద్దితో పనిచేస్తున్నారని కితాబునిచ్చారు. ఇదిలావుంటేఉ ఆగస్టులో ఎల్లంపల్లి నుంచి శ్రీరాంసాగర్‌ కు గోదావరి నీళ్లను తీసుకొచ్చేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. శ్రీరాంసాగర్‌ పునరుజ్జీవన పథకానికి సంబంధించిన మోటర్లు జూన్‌లో రాష్ట్రానికి చేరుకోనున్నాయి. ఇప్పటికే ఇంజినీర్ల బృందం వాటిని పరిశీలించింది. జూలై చివరికల్లా మోటర్ల బిగింపును పూర్తిచేసి ఆగస్టులో ఎల్లంపల్లి నుంచి వరదకాల్వ ద్వారా శ్రీరాంసాగర్‌కు గోదావరి జలాలను తరలించేందుకు అధికారులు ప్రణాళిక సిద్ధంచేశారు. సీఎం కేసీఆర్‌ రూపొందించిన సాగునీటి ప్రాజెక్టుల రీడిజైనింగ్‌లో భాగంగా ఎస్సారెస్పీ కింద ఆయకట్టుకు శాశ్వత ఊరట కలిగించేలా చేపడుతున్న శ్రీరాంసాగర్‌ పునరుజ్జీవన పథకం ద్వారా జలాలను ఎత్తిపోసేందుకుగాను అమర్చాల్సిన మోటర్ల తయారీ ఇప్పటికే చివరి దశలో ఉంది. పంపులు-మోటర్ల భాగాలు వచ్చేనెలలో రాష్ట్రానికి వస్తున్నాయని, జూలైలో వాటి బిగింపు పనుల్ని మొదలుపెడతామని ఓ అధికారి తెలిపారు. వరద కాల్వ 73వ కిలోవిూటర్‌ దగ్గర జగిత్యాల జిల్లా మల్యాల మండలం రాంపూర్‌ గ్రామం వద్ద నిర్మిస్తున్న పంప్‌హౌజ్‌లో 1450 క్యూసెక్కుల డిశ్చార్జి.. 6.5 మెగావాట్ల సామర్థ్యం ఉండే ఎనిమిది పంపులను ఏర్పాటు చేయాల్సి ఉన్నది. ఈ వానకాలానికి అక్కడ మూడు మోటర్లను బిగించాలని నీటిపారుదలశాఖ నిర్ణయించింది. తద్వారా సుమారు 4350 క్యూసెక్కుల నీటిని లిఫ్టు చేసేందుకు వీలవుతుంది. జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం రాజేశ్వర్‌రావుపేట గ్రామం పరిధిలో వరద కాల్వ 34వ కిలోవిూటర్‌ దగ్గర ఏర్పాటు చేస్తున్న పంపుహౌజ్‌లోనూ జూలైలో మూడు మోటర్లను బిగించనున్నారు. చివరి లిప్ట్‌ అయిన నిజామాబాద్‌ జిల్లా ముప్కాల్‌ మండల గ్రామ పరిధిలోని వరద కాల్వ 0.100 కిలోవిూటర్‌ వద్ద మరో మూడు మోటర్లను ఆగస్టులో బిగిస్తారు. ఆగస్టు చివరినాటికి పునరుజ్జీవన పథకంలోని మోటర్ల బిగింపు పనుల్ని పూర్తిచేయాలని భావిస్తున్నారు. కాళేశ్వరం పథకంలో భాగంగా జూన్‌-జూలైలోనే మేడిగడ్డ నుంచి వయా ఎల్లంపల్లి విూదుగా మిడ్‌మానేరుకు గోదావరిజలాల తరలింపు మొదలుకానున్నది. మేడిగడ్డ నుంచి లిఫ్టు చేసే నీటిని ఆగస్టు చివరి వరకు మిడ్‌ మానేరును నింపేందుకు వినియోగిస్తారు. ఈలోగా పునరుజ్జీవన పథకం అందుబాటులోకి రానున్నందున ఆ తర్వాత ఎల్లంపల్లి నుంచి నీటిని వరదకాల్వ ద్వారా శ్రీరాంసాగర్‌కు తరలించనున్నట్టు అధికారిక వర్గాలు తెలిపాయి.