– బ్రాహ్మణీజంపై సబ్బండ వర్గాలు జాగ్రత్తగా ఉండాలే
– విలేకరుల సమావేశంలో జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్జనం సాక్షి, మంథని : కులాలతో రాజకీయాలు చేయడం మంథని ఎమ్మెల్యేకు వెన్నతో పెట్టిన విద్య అని పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ ఆరోపించారు. మంథని పట్టణంలోని రాజగృహాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జడ్పీ ఛైర్మన్ మాట్లాడుతూ.. నియోజకవర్గంలో 80 శాతం పైబడి ఉన్న ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనార్టీ, అగ్రవర్ణాల్లోని పేదల చైతన్యం కోసమే తపిస్తున్నామని చెప్పారు. నియోజకవర్గాన్ని 40 ఏండ్లుగా ఒక కసాయి కుటుంబం పరిపాలన చేస్తోందని, కంప్యూటర్ యుగంలో కూడా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి అధికారంలో ఉంటూ ఈ ప్రాంత ప్రజలను ఓటు వేసే యంత్రాలుగానే చూస్తున్నారని ఆయన విమర్శించారు. కులాలను వాడుకుని, ఆ కులాలతోనే ఓట్లు వేయించుకుని పదవులోకి వచ్చి ఆ కులంలో అభివృధ్ది చెందిన వ్యక్తినే రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా ధ్వంసం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. 2018 ఎన్నికల సమయంలో అనేక కుట్రలు చేసి తనను ప్రజల నుంచి దూరం చేశాడని ఆయన వివరించారు. ఆనాడు మంథని మధూకర్ మృతి చెందితే కాంగ్రెస్ పార్టీకి చెందిన వి.హన్మంతరావు, దానం నాగేందర్‌లాంటి నాయకులను మంథనికి తీసుకువచ్చి ధర్నా చేయించారని ఆయన గుర్తు చేశారు. అయితే మున్నూరు కాపు కులానికి చెందిన ఆడబిడ్డ విషయంలో మధూకర్ మృతి చెందగా మున్నూరు కాపు నాయకులను తీసుకువచ్చి ఆందోళనలు చేయించాడని, మధూకర్ ఎస్సీ సామాజిక వర్గం కావడంతో ఆనాడు ఈ సంఘటనతో ఎస్సీలను దగ్గరకు చేసుకున్నాడని ఆయన అన్నారు. అదే విధంగా మున్నూరు కాపు ఆడబిడ్డకు వ్యతిరేకంగా ధర్నాలు చేయించాడని ఆ సామాజిక వర్గం ఎక్కడ ఆలోచన చేస్తుందోనని ముందుగానే పసిగట్టిన మంథని ఎమ్మెల్యే 2017లో మంథనితో ఎలాంటి సంబంధాలు లేని శివశంకర్ సంస్మరణ సభను నిర్వహించి మున్నూరు కాపులను మోసం చేశాడన్నారు. శివశంకర్ కుమారుడైన విజయ్‌కుమార్‌ను మంథనికి తీసుకువచ్చి తనకు మున్నూరు కాపులు దగ్గరేనని ఆందరిని మభ్యపెట్టాడని అన్నారు. ఆనాడు జరిగిన సభలో శివశంకర్‌ను ఆదర్శంగా తీసుకోవాలని, నియోజకవర్గంలోని నిరుపేద విద్యార్ధుల ఉన్నత చదువుల కోసం శివశంకర్ పేరిట స్కాలర్షిప్లు అందజేస్తామని ప్రకటించాడని, మరి ఐదేండ్లుగా ఎంతమందికి స్కాలర్షిప్లను ఎమ్మెల్యే పంచాడో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. మున్నూరు కాపులంతా ఆనాడు మాట ఇచ్చినట్లుగా విద్యార్దులకు స్కాలర్షిప్లు అందించాలని ఎమ్మెల్యేను నిలదీయాల్సిన అవసరం ఉందన్నారు. అంతే కాకుండా 2017లో శివశంకర్ సంస్మరణ సభ నిర్వహించిన ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు ఐదేండ్లు మళ్లీ శివశంకర్‌ను ఎందుకు స్మరించుకోవడంలేదని ప్రశ్నించారు. ఆనాడు జరిగిన ఎన్నికల్లో తనను ఎస్సీ, బీసీ వర్గాలకు దూరం చేశాడని, తాను ఓడిపోవడంతో మున్నూరు కాపులు ఎవరూ తనకు ఎదురు రారనే రాజనీతిని ఉపయోగించిన కసాయి మంథని ఎమ్మెల్యే అని ఆయన విమర్శించారు. ఆనాడు మంథనితో సంబందం లేని శివశంకర్ ఎమ్మెల్యేకు ఎందుకు గుర్తుకు వచ్చాడో, ఆయన సంస్మరణ సభ ఇక్కడ ఎందుకు నిర్వహించారో మున్నూరు కాపులంతా ఆలోచన చేయాలన్నారు. మున్నూరు కాపు బిడ్డకు అధికారం వస్తే అనేక కుట్రలు చేశారని, ఆ కుట్రలో బాగమే శివశంకర్ సంస్మరణ సభ అని ఆయన తెలిపారు. మున్నూరు కాపు అయిన పుట్ట మధును రాజకీయంగా, ఆర్థికంగా , సామాజికంగా అణిచివేస్తే ఇక ఎవరూ రారనే ఆలోచనతోనే ఎమ్మెల్యే కుట్రలు చేశారన్నారు. అంతే కాకుండా రెడ్డి సామాజిక వర్గం కూడా మంథని ఎమ్మెల్యే విషయంలో ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని, ఆనాడు కిషన్‌రెడ్డిపై గంజాయి కుట్ర చేశాడని, ఆకేసులో కిషన్‌రెడ్డిపై కేసు నమోదై జైలుకు పోతే ఆ కుటుంబం పరిస్థితి ఏంటని ఆలోచన చేయాలన్నారు. కులాలను వాడుకుంటూ ఆ కులాల మధ్యల చిచ్చు పెట్టి రాజకీయ పబ్బం గడుపుకునే మంథని ఎమ్మెల్యేను నమ్మితే మన బతుకులు మారవని అన్నారు. మోసం చేసే వాడిది ఎప్పుడు తప్పు కాదని, మోసపోయే వాళ్లది, పదేపదే మోసపోయే వాళ్లదే తప్పు అని స్పష్టం చేశారు. 40 ఏండ్గుగా పాలిస్తున్న కసాయి కుటుంబం నుంచి సబ్బండ వర్గాల విముక్తి కోసమే తన పోరాటమని ఆయన తేల్చి చెప్పారు. బ్రాహ్మణీజంపై ఎస్సీ, ఎస్టీ,బీసీ మైనార్టీలతో పాటు అగ్రవర్ణాల్లోని పేదలు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
కులాలతో రాజకీయాలు ఎమ్మెల్యేకు వెన్నతో పెట్టిన విద్య.




