తొందరపడవద్దన్న కాంగ్రెస్
హైదరాబాద్,నవంబర్5(జనంసాక్షి): మహాకూటమి పొత్తులు ఖరారవుతున్న వేళ ఎలాంటి తొందపాటు చర్యలకు దిగవద్దని కూటమి మిత్రులకు కాంగ్రెస్ సూచించింది. సిపిఐ ఇప్పటికే 9 స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించింది. దీంతోపాటు టిజెఎస్ కూడా కాంగ్రెస్ తీరుతో అసహనంగా ఉంది. తెలంగాణలో మహా కూటమిలో సీట్ల సర్దుబాటును త్వరగా పూర్తి చేయాలని కాంగ్రెస్ పార్టీ యోచిస్తోంది. దిల్లీలో మంగళవారం కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం ఉండటంతో కూటమికి చెందిన లెక్కలు తేల్చాల్సి ఉంది. తెదేపాకు 14 సీట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్‌తో అవగాహన కుదిరినా.. మరికొన్ని సీట్లు కావాలని వారు కోరుతున్నట్టు తెలుస్తోంది. కూటమిలోని ఐదు సీట్లు కోసం సీపీఐ, పది సీట్ల కోసం తెజస పట్టుబడుతున్నాయి. ఈ నేపథ్యంలో మహాకూటమి సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ భేటీ ఎక్కడ ఉంటుందన్న విషయమైతే గోప్యంగా ఉంచారు. సాయంత్రానికి కూటమి చర్చలు ఓ కొలిక్కి వస్తే ఈ రోజు రాత్రికే టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్, కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి ఆర్‌సీ కుంతియాలతో పాటు సీనియర్ నేతలు దిల్లీకి వెళ్లే అవకాశం ఉంది. రాత్రికి వీలు కాకపోతే ఉదయమైనా బయల్దేరి హస్తినకు వెళ్తారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. అయితే, సాయంత్రంలోగా కూటమి సర్దుబాట్లు తేల్చే యోచనలో ఉన్నామని.. తొందరపడి నిర్ణయం తీసుకోవద్దని సీపీఐకి వర్తమానం పంపినట్టు సమాచారం.




