Wednesday, 4 November 2026

కూటమి లక్ష్యం కెసిఆర్‌ను దెబ్బతీయడం

తమ పప్పులు ఉడకవనే అసంబద్ద ఆరోపణలు: బోడకుంటి
హైదరాబాద్‌,అక్టోబర్‌16(జ‌నంసాక్షి): కేసీఆర్‌ను దెబ్బతీయడం లక్ష్యంగా  అందరు కలిసి ఓ కూటమి కట్టారని, మహాకూటమి పేరుతో తిరుగుతున్నారని మండలి విప్‌, ఎమ్మెల్సీ బోడకుంటి వెంకటేశ్వర్లు అన్నారు. కెసిఆర్‌ అధికారంలో ఉన్నంత కాలం తమ పప్పులు ఉడకవనే లేనిపోని విమర్శలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాల్లో ఉన్నారని మండిపడ్డారు.  ఈ కూటమిలో ఉన్న నాయకుల వెంట జనం లేరని, అందుకే ఆకట్టుకునేందుకు విమర్వలతో ముందుకు పోవఆలని చూస్తున్నారని అన్నారు.  ఎందుకంటే ఇది ప్రజల కోసం ఏర్పడింది కాదు. ప్రజలకు ఏదో బాగు చేయాలనే ఉద్ధేశ్యం కూడా కూటమి నాయకులకు లేదన్నారు.  తమ స్వప్రయోజనాలు, పదవుల కోసం ప్రతిపక్ష నాయకులు కూటమిగా ఏర్పడ్డారు. కూటమిలోని నాయకుల్లో ఐదారుగురు అంటే ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జానారెడ్డి, కోమటిరెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, రేవంత్‌రెడ్డి ఇలా ఎవరికి వారే సీఎంను నేనే అని చెబుకుంటున్నారు. మహాకూటమిలో అంతా సీఎం కావాలని కలలు గనే వారని ఎద్దేవా చేశారు. వారిని ఆదరిస్తే కుర్చీల కొట్లాట తప్పదన్నారు.  గత చరిత్ర చూస్తే కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ఆరు నెలలు, ఏడాదికొక సీఎం మారారని అన్నారు.. కూటమిలోని నేతలు అప్పుడే టిక్కెట్ల కోసం కొట్లాడుకుంటున్న తీరు ప్రజలను ఏవగింపునకు గురి చేస్తోందన్నారు. ఇప్పటికే టీజేఎస్‌ నేత కోదండరాంపై ఒత్తిడి పెరిగింది. టీజేఎస్‌లోని ఓ మహిళా నాయకురాలు పార్టీకి రాజీనామా చేసి బయటకు రావడం గమనిస్తే ఎందుకిలా జరిగిందో గమనించాలి. ప్రజలంతా అభివృద్దికి జై కొడుతున్నారని, టీఆర్‌ఎస్‌ పాలన కావాలి, సీఎం కేసీఆర్‌ కావాలని కోరుకుంటున్నారని అన్నారు. టీఆర్‌ఎస్‌ కు ప్రజల సంపూర్ణ మద్దతు ఉందని, టీఆర్‌ఎస్‌ మళ్లీ అధికారంలోకి రావాలని గట్టిగా కోరుకుంటున్నారు.
కేసీఆర్‌తోనే బంగారు తెలంగాణ సాధ్యమని విశ్వసిస్తున్నారు.నాలుగేళ్లలో జరిగిన అభివృద్ధిని చూస్తున్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన సంక్షేమ పథకాల ఫలాలను పొందుతున్నారు. దీంతో ఈ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేయాలని, టీఆర్‌ఎస్‌ను గెలిపించాలనే కృతనిశ్చయానికి వచ్చారు. మహాకూటమిని ప్రజలు విశ్వసించడంలేదు. కేవలం అధికారం కోసం ప్రతిపక్ష నేతలు కేసీఆర్‌ను ఓడించడమే లక్ష్యంగా కూటమి కట్టారని జనం భావిస్తున్నారు. ఇప్పటికే కూటమిలో టిక్కెట్ల కోసం కొట్లాట జరుగుతుంది. అది మరింత ముదరి ప్రజలు ఛీత్కరించుకునే వరకు వెళ్లగలదని బోడకుంటి అన్నారు. ప్రజలకు నాలుగేళ్లలో తెలంగాణలో ఏం జరిగిందో తెలుసని, అందుకే విమర్శలను తాము పట్టించుకోబోమని అన్నారు.