ఐదేళ్లుగా ఎందుకీ చర్యలు తీసుకోలేదన్నదే ప్రశ్న
ఆర్టీసీ ఆస్థులకు సంబంధించి అనుమానాలు వెల్లడించాలి
హైదరాబాద్,అక్టోబర్7 జనం సాక్షి : ఆర్టీసికి వేలకోట్ల ఆస్తులు ఉన్నాయి. ఆర్టీసీపై అనేక రకాల పన్నుల భారం కూడా పడుతోంది. ప్రజా రవాణాగా ఉన్న ఈ సంస్థకు ప్రభుత్వం కూడా బకాయిలు పడుతోంది. ఇలాంటి సందర్బంలో నష్టాలు ఈ ఒక్కరోజే వచ్చినవి కావు. వీటి నుంచి బయటపడేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచించడం లేదు. ఓ రకంగా ఆర్టీసీ ఆస్తులపై కొందరుకన్నేసినట్లు కనిపిస్తోంది. ఆర్టీసీ కార్మిక సంఘాలు ఇదే విషయంపై ఆరోపణలు చేస్తున్నాయి. ఈ పరిణామలు ఎటు వైపు దారి తీస్తాయన్నది చూడాలి. గత నలభై సంవత్సరాలు గా ఆర్టీసీ చుట్టూ అల్లుకున్న వ్యవహారం నిరంతర సమస్యగా పరిణమించింది. దీనికి శాశ్వత పరిష్కారం కనుగొనాలి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాక అనేక రంగాల్లో ముందుకు దూసుకుని పోతోంది. ఈ తరుణంలో ఆర్టీసీ సమ్మెల్లాంటివి ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేసేలా మారాయని సిఎం కెసిర్ భావిస్తున్నారు. తాజా సమ్మె చట్టవ్యతిరేకం, బాధ్యతారాహిత్యం అని కూడా అన్నారు. మధ్యప్రదేశ్, జార్ఖండ్, చత్తీస్గఢ్, మణిపూర్ రాష్టాల్లో ఆర్టీసీ లేనే లేదు. బిహార్, ఒడిశా, జమ్మూ, కశ్మీర్, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, ఉత్తర్ప్రదేశ్ వంటి రాష్టాల్రలో నామమాత్రంగా ఉంది. అలా చూస్తే కర్ణాటక తర్వాత తెలంగాణలోనే అత్యధికంగా బస్సులు నడుస్తున్నాయి. ప్రభుత్వం ఆర్టీసీని ఇంత మంచిగా చూసుకుంటుంటే వారు సమ్మెకు దిగడం అవసరమా అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు సమతౌల్యం పాటించాలని అభిప్రాయపడ్డారు. ఒకపక్క ప్రైవేటు భాగస్వామ్యం, మరోపక్క ఆర్టీసీ యాజమాన్యం ఉంటే మంచిదని పేర్కొన్నారు. సమ్మె విషయంలో జనం తీవ్ర ఆగ్రహంగా ఉన్నారని, సోషల్ విూడియాలో వారి స్పందనే ఇందుకు నిదర్శనమని వ్యాఖ్యానించారు. సమ్మె వల్ల ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలిగించినందున వారిని ఎట్టి పరిస్థితుల్లో విధుల్లోకి తీసుకోబోమన్నారు. సమ్మెలో ఉన్నవారిని తిరిగి తీసుకునే వీలు లేనందున త్వరలోనే వారి స్థానంలో కొత్త నియామకాలు చేపట్టనున్నట్టు
సీఎం కేసీఆర్ వెల్లడించిన నేపథ్యంలో ఇప్పుడు భవితవ్యం ఏంటన్నది అనుమానాలు కలుగుతున్నాయి. తక్షణంగా ఆర్టీసీ సమ్మెకు పరిష్కారం ఇదేనా అన్నది కూడా తెలియడం లేదు. కొత్తగా చేర్చుకునే సిబ్బంది యూనియన్లలో చేరబోమని ఒప్పంద పత్రం విూద సంతకం చేయాల్సి ఉంటుందని తేల్చి చెప్పడం కూడా నిరంకుశ విధానాలు కాక మరోటి కాదు. వారి నియామకం షరతులతో కూడుకుని ఉంటుందని, ప్రొబేషన్ పిరియడ్ కూడా అమలవుతుందని పేర్కొన్నారు. ఏయే కేటగిరీకి చెందిన సిబ్బంది సమ్మెలో ఉన్నారో వారి స్థానాలను ఖాళీలుగా భావించి భర్తీ పక్రియ ఉంటుందని వెల్లడించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే విషయంలో అఖిలపక్ష సమావేశం జరపాలని కొందరు డిమాండ్ చేస్తున్నారని, ఆయా పార్టీలకు ఆర్టీసీపై మాట్లాడే హక్కే లేదని సీఎం వ్యాఖ్యానించారు.బీజేపీ ఎన్నో రాష్టాల్లో అధికారంలో ఉన్నా, అక్కడ ఎందుకు చేయలేదని అడిగారు. మరి కాంగ్రెస్ ఏం చేసిందని నిలదీశారు. అందుకే వాళ్లకు విలీనంపై అడిగే హక్కు లేదని అంటున్నట్టు పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అందరి కళ్ళూ తెరిపించాలని కూడా పేర్కొన్నారు. సమ్మె నేపథ్యంలో తక్షణ చర్యగా 2,500 బస్సులను అద్దె ప్రాతిపదికన తీసుకుని నడపాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అందుబాటులో ఉన్న 4,114 ప్రైవేటు బస్సులను పర్మిట్లతో స్టేజ్ క్యారియర్లుగా మారిస్తే అవి కూడా ఆర్టీసీ పరిధిలోకి వస్తాయన్నారు. ఈ విషయంలో బస్సుల నిర్వాహకులతో ఆర్టీసీ, రవాణా శాఖ అధికారులు చర్చలు జరుపుతున్నట్టు వెల్లడించారు.ఆర్టీసీ సరుకు రవాణా ద్వారా కూడా లాభాలు రాబట్టాలి. ఈ పోటీ ప్రపంచంలో వినూత్నంగా ఆలోచించి సంస్థను లాభాల్లోకి తీసుకురావాలి. అనేక రంగాలలో ముందున్న తెలంగాణ రాష్ట్రం ఆర్టీసీలో కూడా ముందుండాలి. తెలంగాణ గొప్ప రాష్ట్రంగా తయారుకావడమే నాకు అన్నింటికంటే అధిక ప్రాధాన్యమైన అంశం. అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ విషయాలన్నీ కూలంకషంగా చర్చించి నివేదిక సమర్పించడానికి రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేశారు. మొత్తంగా ఇప్పుడు ఆర్టీసీలో ఏం జరుగబోతున్నదన్నది చూడాలి.




