హైదరాబాద్ :‘‘ప్రత్యేకంగా సెలవులిస్తాం.. రూ.20 వేల నగదూ ఇస్తాం.. అడవులకు వెళ్లండి. సాహస యాత్రలు చేయండి.. ట్రెక్కింగ్, పర్వతారోహణ, ఎడారి యాత్ర, పడవ ప్రయాణం.. అలలపై సర్ఫింగ్.. ఏదైనా మీ ఇష్టం..’’ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సిబ్బంది, శిక్షణ విభాగం(డీవోపీటీ) కల్పిస్తున్న అవకాశమిది. వృత్తిజీవితంలో ఒత్తిడిని జయించి.. సవాళ్లను ఎదుర్కొనేలా ఉద్యోగులను రీచార్జ్ చేసేందుకని కార్పొరేట్ కంపెనీలు ట్రెక్కింగ్, పర్వతారోహణ వంటి సాహస క్రీడలకు పంపుతుండటం.. యోగా, ధ్యానం తరగతులూ నిర్వహిస్తుండటం మనకు తెలిసిందే. అయితే, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు యోగా తరగతులను ఇదివరకే ప్రారంభించిన కేంద్రం తాజాగా సాహస క్రీడలకూ అవకాశం కల్పించింది. పనిచేసే చోట జిమ్‌లను కూడా ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది. ఈ చర్యల ద్వారా జీవితంలో స్తబ్దత నుంచి బయటపడతారని, మానసికంగా దృఢంగా తయారై సవాళ్లను ఎదుర్కొనేందుకు సమర్థంగా తయారవుతారని డీవోపీటీ పేర్కొంది. ఉద్యోగులు మానసికోల్లాసం పొంది ఆరోగ్యవంతులయితే ఉత్పాదకత పెరగడంతో పాటు అనారోగ్యరీత్యా సెలవులు పెట్టడమూ తగ్గుతుందని తెలిపింది.




