– అహంకారంతో నియంతలా పాలన సాగిస్తున్నాడు
– కార్మికుల పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలి
– ఇప్పటికైన వారిని పిలిచి చర్చలు జరపాలి
– కాంగ్రెస్ సభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క
హైదరాబాద్, నవంబర్19(జనం సాక్షి) : రాష్ట్రంలో గత నెలన్నర రోజులుగా దాదాపు 50వేల మంది ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తుంటే సీఎం కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదని కాంగ్రెస్ సభాపక్ష నేత మల్లు భట్టివిక్రమార్క విమర్శించారు. స్వర్గీయ ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా గాంధీభవన్‌లో జరిగిన కార్యక్రమంలో భట్టి పాల్గొన్నారు. ఈసందర్భంగా ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సీఎల్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నియంతలా పాలన సాగిస్తున్నాడని విమర్శించారు. న్యాయస్థానం చెప్పిన దాన్ని కూడా పట్టించుకోబోమనే పరిస్థితులు కల్పిస్తున్నారన్నారు. స్వేచ్ఛగా తమ భావాలను వ్యక్తపరిచే తెలంగాణ సమాజం నేడు సీఎం కేసీఆర్ చేతిలో నలిగిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ యంత్రాంగం నడవాలంటే ఉద్యోగులు అవసరమని, అలాంటిది 50వేల మంది కార్మికులు సమ్మెకు వెళ్తే వారు సెల్ఫ్ డిస్మిస్ అయ్యారని అంటున్నారని మండిపడ్డారు. న్యాయ వ్యవస్థను, ఉద్యోగ వ్యవస్థను గౌరవించే ఆలోచన సీఎంకు రావడం లేదని, అధికారం, అహంకారంతో నియంతలా మారిపోయారన్నారు. కార్మికుల పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలని హైకోర్టు పలుమార్లు సూచించిందని, తెలంగాణ రాష్ట్రం ప్రజాస్వామ్య రాష్ట్రమని, పోరాడి సాధించుకున్న తెలంగాణ అభ్యుదయ భావాలు కలిగినదని భట్టి పేర్కొన్నారు. స్వేచ్ఛగా భావాలను వ్యక్తపరిచే సమాజమని, అలాంటి సమాజం సీఎం చేతిలో నలిగిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా హైకోర్టు చెప్పిన సూచనలను పాటించి కార్మికులతో సీఎం చర్చించాలని భట్టి డిమాండ్ చేశారు. ర్టీసీ కార్మికులు తెలంగాణ బిడ్డలేనని, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో వారూ భాగస్వాములేనని భట్టి పేర్కొన్నారు.




