Tuesday, 3 November 2026

కేసీఆర్‌ పై ప్రజల నమ్మకం వమ్ము కాలేదు

– దేశంలోని సభల రికార్డును ‘ప్రగతి నివేదన’ సభ బ్రేక్‌ చేసింది
– దేశం మొత్తం సభపై చర్చ జరుగుతుంది
– కాంగ్రెస్‌ నేతలు చౌకబారు వ్యాఖ్యలు సరికాదు
– సభలోనూ అమరవీరులకు కేసీఆర్‌ నివాళులర్పించారు
– విలేకరుల సమావేశంలో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌
హైదరాబాద్‌, సెప్టెంబర్‌3(జ‌నం సాక్షి) : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పై ప్రజల నమ్మకం వమ్ము కాలేదని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌ అన్నారు. సోమవారం ఆయన విూడియాతో మాట్లాడుతూ.. పదిరోజుల్లో విజయవంతంగా టీఆర్‌ఎస్‌ సభ నిర్వహించిందన్నారు. దేశ వ్యాప్తంగా టీఆర్‌ఎస్‌ సభకు 25 లక్షల మంది జనం వస్తారా లేదా అని అనేక మంది అనుమానాలు వ్యక్తం చేసారని, అన్ని సభల రికార్జులను ‘ప్రగతి నివేదన’ సభ బ్రేక్‌ చేసిందని ప్రభాకర్‌ తెలిపారు. సభను సక్సెస్‌ చేసిన వారందరికి దన్యవాదాలు తెలిపారు. 12 వందల ఎకరాలు నుంచి 2200 ఎకరాల వరకు సభ విస్తీర్ణంకు పెరిగింది, అక్కడ భూములిచ్చి సహకరించిన రైతులకు ధన్యవాదాలు అని ప్రభాకర్‌ తెలిపారు. కాంగ్రెస్‌ నాయకులు దివాలకోరు దిగజారుడు విమర్శలు చేస్తున్నారని ప్రభాకర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ ముగిసిన పది నిమిషాల్లో ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి తుస్సుమందని చెప్పడం దివాలకోరు తనానికి నిదర్శనమన్నారు. మా సభ భారతదేశంలో కొత్త రికార్డులు సృష్టించిందన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీపై నమ్మకంతో ఏ సభకు సీఎం కేసీఆర్‌ పిలుపునిచ్చినా.. ప్రజలు ప్రతిసారి విజయవంతం చేసారని,  ముఖ్యమంత్రి కేసీఆర్‌ పై ప్రజల నమ్మకం వమ్ము కాలేదన్నారు. రాహుల్‌ గాంధీతో కాంగ్రెస్‌ నారు సభలు పెట్టారు, ఏ ముఖంతో టీఆర్‌ఎస్‌ పార్టీని విమర్శిస్తున్నారని ప్రభాకర్‌ ప్రశ్నించారు. 42 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పాలించిన వారు ఏ ఒక్క సమస్యనైనా పరిష్కరించారా అని అడిగారు. అమర వీరులను స్మరించుకోలేదని కాంగ్రెస్‌ విమర్శించడం సరికాదన్నారు. టీఆర్‌ఎస్‌ ఉద్యమ కాలం నుంచి అమరులను ప్రతి సందర్భంలో తలచుకున్నామని, ప్రగతి నివేదన సభలో కూడా అమరులకు సీఎం కేసీఆర్‌ నివాళులర్పించారని తెలిపారు. ఆదివారం నాటి సభకు జనం పొటెత్తి వచ్చారని, 25 లక్షల మంది జనంలో మూడోవంతు మంది సభలో ఉంటే రోడ్లపై ట్రాఫిక్‌ జాం కావడంతో మిగతా జనం అందులో చిక్కుకున్నారన్నారు. సభపై కోర్టు ఆదేశంతో పర్యావరణ కాపాడుకోవడం కోసం సభ ముగిసిన వెంటనే పరిశుభ్రంగా చేస్తున్నామని కర్నె ప్రభాకర్‌ అన్నారు.
అమిత్‌ షాను ఉత్తమ్‌ సీక్రెట్‌గా ఎందుకు కలిశారో చెప్పాలి – దానం
ప్రపంచంలో ఎక్కడా జరగలేని విధంగా కొంగరకొలాన్‌లో సభ జరిగితే.. కళ్లుండి చూడలేని కొందరు కాకిగోల చేస్తున్నారని టీఆర్‌ఎస్‌ నేత, మాజీ మంత్రి దానం నాగేందర్‌ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సభ అట్టర్‌ ప్లాప్‌ అయ్యిందంటూ ఉత్తమ్‌ ఉత్తమాటలు చెబుతున్నారని మండిపడ్డారు. గాంధీభవన్‌లో ఉత్తమ్‌ హటావో.. కాంగ్రెస్‌ బచావో అంటూ ఆ పార్టీ నేతలే అంటున్నారని చెప్పారు. కేసీఆర్‌, కేటీఆర్‌ను చూసి కాంగ్రెస్‌, బీజేపీకి ఓటమి భయం పట్టుకుందన్నారు. ఇక ఇతర పార్టీల నుంచి చాలా మంది రావడానికి సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు. కానీ టీఆర్‌ఎస్‌లో ఖాళీ లేదని పేర్కొన్నారు. బీజేపీకి ఒక్క సీటు కూడా రాదని ప్రధానికి కేసీఆర్‌ చెప్పారన్నారు. అమిత్‌ షాతో ఉత్తమ్‌ సీక్రెట్‌ విూటంగ్‌ ఎందుకు పెట్టారో చెప్పాలని దానం డిమాండ్‌ చేశారు.