Tuesday, 3 November 2026

కొత్త కార్యదర్శుల నియామకానికి కసరత్తు

హైదరాబాద్‌,ఆగస్ట్‌3(జ‌నం సాక్షి): ప్రతీ పంచాయితీకి ఒక కార్యదర్శి ఉండాలని సీఎం కేసీఆర్‌ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఇకపై ప్రతీ గ్రామ పంచాయతీకి ఒక కార్యదర్శి రాబోతున్నారు. నియామక పక్రియను సంబంధిత శాఖాధికారులు వేగవంతం చేస్తున్నారు.ఇప్పటికే ఉన్న కార్యదర్శులు అదనపు బాధ్యతలు నిర్వహిస్తూ పని ఒత్తిడికి గురవుతున్నారు. ఒక్కో కార్యదర్శి సుమారు 3 నుండి 6 పంచాయితీలకు అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కార్యదర్శుల నియామక పక్రియ మరో వారం రోజుల్లో ప్రారంభం కానుంది. కొత్తగా నియమించే కార్యదర్శులకు మూడేళ్ల పాటు ప్రొబేషనరీ పీరియడ్‌ ఉంటుంది. తర్వాత కార్యదర్శుల పని తీరును బట్టి క్రమబద్ధీకరణ ఉంటుంది. సక్రమంగా పని చేయని కార్యదర్శులను క్రమబద్ధీకరించకుండా ఉండేలా నిబంధనలు రూపొందించాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. కొత్త కార్యదర్శులకు ప్రొబేషనరీ పీరియడ్‌లో నెలకు రూ.15 వేలు చొప్పున వేతనం అందిస్తుంది. నియామక పక్రియ, పంచాయితీ కార్యదర్శుల విధులు, బాధ్యతలు, తదితర అంశాల్లో విధి విధానాలు రూపొందించాలని సీఎం కేసీఆర్‌, మంత్రి జూపల్లి కృష్ణారావు ఉన్నతాధికారులను ఆదేశించారు. దీనితో సంబంధిత అధికారులు కార్యదర్శుల నియామకాలపై కసరత్తు చేస్తున్నారు. నియామకాలు పూర్తి అయితే మరో రెండు నెలల్లో కొత్త కార్యదర్శులు విధుల్లో చేరవచ్చు.