సిఎం కెసిఆర్ నిర్ణయంపై సర్వత్రా ఎదురుచూపు
హైదరాబాద్,అక్టోబర్17(జనంసాక్షి): పదిజిల్లాలు కొత్తగా 31 జిల్లాలుగా ఏర్పడ్డా, పలు మండలాలు ఆవిర్భవించినా ప్రస్తుతానికి పాత జిల్లా పరిషత్‌లు, మండలాలు కొనసాగుతున్నాయి. వీటి కాలపరిమితి ముగిసే వరకు పాతపద్దతిలోనే జడ్పీ పాలన సాగనుంది. దీంతో 31 జిల్లాలకు కొత్తగా జడ్పీలను ఏర్పాటు చేస్తారా లేక వాటిని కొంతకాలం పెండింగ్ పెడతారా అన్నది తేలాల్సి ఉంది. మరో ఏడాదిన్నరలో కాలపరిమితి ముగియనుంది. దీంతో కొత్త జిల్లాలకు అనుగుణంగా జడ్పీలను ఏర్పాటు చేయాలి. అలాగే కొత్త మండలాలకు కూడా ఇదే పరిస్థితి ఉంది. దీనిపై సిఎం కెసిఆర్ నిర్ణయం తసీఉకోవాల్సి ఉంది.
పంచాయితీ ఎన్నికల నాటికి కొత్త జడ్పీలకు ఎన్నికలు నిర్వహిస్తారా లేదా అన్నది తేలాల్సి ఉంది. కొత్తగా జడ్పీలు ఏర్పాటు చేస్తారా లేక పాత జిల్లాల పరిధిలోనే ఉంటాయా అన్నది తేలాల్సి ఉంది. ఇప్పటికిప్పుడు కొత్తగా జడ్పీలను ఏర్పాటు చేసే ఆలోచన ప్రభుత్వానికి లేదని తెలుస్తోంది. జిల్లాలను పునర్వ్యవస్థీకరణ చేశారు. కానీ, జిల్లా పరిషత్తులను మాత్రం యథాతథంగానే ఉంచారు. ఇప్పుడు ఒక్కో జడ్పీ మూడు నాలుగు జిల్లాల్లో అధికార పరిధిని కలిగి ఉంటోంది. మళ్లీ ఎన్నికలు జరిగే వరకు పరిస్థితి ఇలాగే కొనసాగనుంది. దాదాపు అన్ని పరిషత్లలోనూ అధికార టిఆర్ఎస్ ఉండడంతో గందరగోలానికి తావుండడం లేదున.ఉమ్మడిగా సమావేశాలు గతంలో లాగేనే యధావిధిగా సాగుతున్నాయి. ఉమ్మడి జిల్లా పరిధిలోని పథకాలపై జిల్లా పరిషత్తు చైర్మన్ ఆదేశాలు జారీ చేస్తున్నారు. రాబోయే ఏడాదిన్నర కాలంలో కూడా జడ్పీల్లో ఇదే పరిస్థితులు కొనసాగినా తరవాత ఎలాంటి పరిస్థితి ఉంటుందో తెలియాల్సి ఉంది. జడ్పీ పనులు, పథకాల అమలుకు సంబంధించి పర్యవేక్షణ అధికారం యధావిధిగా గతంలో లాగే సాగుతున్నాయి. కేంద్రం నుంచి వచ్చే నిధులు కానీ, రాష్ట్రం ఇచ్చే నిధులను కానీ పాత జిల్లా పరిషత్తులకే కేటాయిస్తున్నారు. వాటిని కొత్తగా ఏర్పడిన జిల్లాల్లోని మండలాలకు మంజూరు చేయడం పాతపద్దతిలోనే సాగుతోంది. నిజానికి, జిల్లాల పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలోనే జిల్లా పరిషత్తులను కూడా పునర్వ్యవ స్థీకరణ చేయాలా అనే కోణంలో ప్రభుత్వం ఆలోచించింది. అయితే, జడ్పీలకు సంబంధించి ప్రస్తుత విధానాన్ని మిగిలిన రెండున్నరేళ్లూ యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించినట్లు తెలిసింది. జడ్పీటీసీలు, పాలకవర్గం ఐదేళ్ల పాలనా కాలానికి ఎన్నికయ్యారని, ఇప్పుడు వారి పరిధిని తగ్గిస్తే న్యాయ పరమైన చిక్కులు వచ్చే అవకాశం ఉందని భావించారు. రాజకీయ కోణంలో ఆలోచించిన ప్రభుత్వం జిల్లాలను పునర్వ్యవస్థీకరించినా.. జడ్పీలను యథాతథంగానే ఉంచాలని నిర్ణయించింది. ఈ ఐదేళ్ల పదవీ కాలం ముగిసిన తరవాత ఎలా అన్నదే ఇప్పుడు తేలాల్సి ఉంది. రాబోయే ఏడాదిన్నరలో జడ్పీ పాలనను సంక్షోభం లేకుండా సిఎం కెసిఆర్ పర్యవేక్షస్తున్నారు. నిధుల మంజూరు, వినియోగం, పథకాల అమలుకు సంబంధించి ఎలాంటి సమస్యల లేకుండా చేస్తున్నారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరిగితే, నిధుల మంజూరు, పథకాల పర్యవేక్షణ ఎలా అనే అంశానికి సంబంధించి చట్టంలో ఎటువంటి ప్రస్తావన లేకపోవడమే ప్రస్తుతం యధావిధిగా సాగుతున్నాయి. తదుపరి జిల్లాలవారీగా జడ్పీలను విభజించి వాటికి పాలకవర్గాలను ఏర్పాటు చేయడమే ఉత్తమమని కొంతమంది వివరిస్తున్నారు. జిల్లాలను కూడా ఆర్డినెన్స్ ద్వారా ఏర్పాటు చేసిన నేపథ్యంలో, జిల్లాల విభజనను కూడా చట్టబద్ధంగా చేసినట్లేనని, ఆయా జిల్లాలకు పాలక వర్గాలను ఏర్పాటు చేయడం కూడా చట్టబద్ధమే అవుతుందని చెబుతున్నారు. జడ్పీ చైర్మన్‌ను జడ్పీటీసీలే పరోక్ష పద్ధతిలో ఎన్నుకున్నారని, ఇప్పుడు వారంతా ఇతర జిల్లాల పరిధిలోకి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో జిల్లా పరిషత్తులను కొత్తగా పునర్వ్యవస్థీకరించిన తరవాతనే మళ్లీ ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉంది. లేదా వాటిని వాయిదా వేసే అధికారం కూడా ప్రభుత్వానికి ఉంటుంది.




