పంచాయితీ ఎన్నికలపై వేగంగా పనులు
హైదరాబాద్,జూన్21(జనం సాక్షి): పంచాయితీ రిజర్వేషన్లపై అధికార యంత్రాంగం కసరత్తు మొదలెట్టింది.ఇప్పటికే బీసీ ఓటర్ల గణన పూర్తి చేయగా.. బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు కేటాయించాల్సిన రిజర్వేషన్ల శాతంపై స్పష్టత వచ్చింది. ఇప్పటికే గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. కొత్త పంచాయతీరాజ్ చట్టం తీసుకొచ్చాక తొలిసారి ఎన్నికలు నిర్వహిస్తుండగా.. కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసి తొలిసారిగా ఎన్నికలు జరుగుతున్నాయి. రిజర్వేషన్ల ఖరారుపై అధికారులు కసరత్తు చేస్తుండగా.. ఐదారు రోజుల్లో అధికారికంగా ప్రకటించనున్నారు. సర్పంచులకు గ్రావిూణాభివృద్ధిశాఖ కమిషనర్ స్థాయిలో, వార్డులకు ఆర్డీవో స్థాయిలో రిజర్వేషన్లు ఖరారు చేస్తారు. గ్రావిూణ ఓటర్ల తుది జాబితా, పోలింగ్ స్టేషన్ల గుర్తింపు, బ్యాలెట్ బాక్స్‌లు, బ్యాలెట్ పత్రాలు సిద్ధం చేశారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన సిబ్బందిని కూడా నియమించి వారికి శిక్షణ కూడా ఇచ్చారు. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అవసరమైన పోలీస్ బందోబస్తుపై ప్రాథమికంగా కసరత్తు పూర్తి చేశారు. ఎన్నికల పక్రియలో కీలకమైన రిజర్వేషన్ల ఖరారుపై పంచాయతీరాజ్ అధికారులు ఇప్పటికే కసరత్తు చేస్తున్నారు. బీసీలకు 34శాతం రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎస్సీలకు 20.46శాతం, ఎస్టీలకు 5.73శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నారు. ఇక వందశాతం ఎస్టీలున్న గ్రామపంచాయతీల్లో వారికే రిజర్వ్ చేయనున్నారు. రూల్‌ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం ఇతర కేటగిరీ గ్రామపంచాయతీల్లోనూ పలు స్థానాలను ఎస్టీలకు కేటాయించనున్నారు. గతంలో ఆయా వర్గాల ఓటర్ల సంఖ్య ఆధారంగా జిల్లాస్థాయిలోనే సర్పంచుల పదవులకు రిజర్వేషన్లు ఖరారు చేసేవారు. గత ఎన్నికల నుంచి రాష్ట్ర యూనిట్‌గా సర్పంచ్ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేస్తున్నారు. 2011 జనాభా లెక్కల ఆధారంగా ఈసారి కూడా సర్పంచుల రిజర్వేషన్లు ఖరారు చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొ త్త పంచాయతీరాజ్ చట్టాన్ని అమల్లోకి తీసుకు వచ్చింది. దీని ప్రకారం త్వరలోనే గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇప్పటివరకు అమల్లో ఉన్న రిజర్వేషన్ల విధానాన్ని నిలిపేసి మళ్లీ కొత్తగా మొదలు పెట్టారు. దీంతో ఇప్పటి వరకు గ్రామపంచాయతీల్లో ఉన్న రిజర్వేషన్ల స్వరూపం పూర్తిగా మారి పోనుంది. తాజాగా ఖరారు చేసే పంచాయతీ రిజర్వేషన్లు పదేళ్ల పాటు అమలు చేయనున్నారు. ఈ మేరకు జిల్లాల వారీగా సర్పంచు పదవుల రిజర్వేషన్లు రాష్ట్రస్థాయిలో ఖరారు చేస్తారు. మండలం యూనిట్‌గా సర్పంచ్, గ్రామం యూనిట్‌గా వార్డుమెంబర్ల పదవులకు రిజర్వేషన్లు ఉంటాయి. ఇక సర్పంచ్, వార్డుస్థానాలకు ప్రతి కేటాగిరిలోనూ 50శాతం మహిళలకు రిజర్వేషన్ చేస్తారు. వందశాతం ఎస్టీ గ్రామాలతో పాటు ఇతర గ్రామపంచాయతీల్లో 50శాతం సర్పంచ్, వార్డు పదవులు మహిళలకు దక్కనున్నాయి.




