మరో పది రోజుల్లో నాగోల్ నుంచి మియాపూర్ వరకు మెట్రో రైలు నడిచేందుకు ట్రాక్ పూర్తవుతున్నది. 24 స్టేషన్ల మీదుగా 30 కిలోమీటర్లు ప్రయాణించేందుకు మార్గం సుగమమవుతున్నది. ఇప్పటికే నాగోల్ నుంచి బేగంపేట వరకు, మియాపూర్ నుంచి ఎస్సార్‌నగర్ వరకు పనులు పూర్తయ్యాయి. మిగిలిన అమీర్‌పేట ఇంటర్ చేంజ్ పనులతోపాటు, బేగంపేట నుంచి అమీర్‌పేట్, ఎస్సార్‌నగర్-అమీర్‌పేట్ మధ్య గ్యాప్‌ను కలిపే పనులు చకచకా జరుగుతున్నాయి. మిగిలిఉన్న ఇంటర్‌చేంజ్ స్టేషన్‌తోపాటు ఇతర ట్రాక్, సిగ్నలింగ్, ఎలక్ట్రిఫికేషన్ వర్క్స్ దాదాపు పూర్తికావచ్చాయి. ఈ పనులన్నీ కేవలం పదిరోజుల్లోనే పూర్తిచేసి నాగోల్-మియాపూర్ ఆపరేషన్స్ కు సంబంధించిన పనులు పూర్తిచేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందుకు నిత్యం 400 మంది రాత్రి, పగలు పనిచేస్తున్నారు.
నాగోల్ నుంచి మియాపూర్ వరకు పూర్తిచేసిన మెట్రోరైలు ప్రాజెక్టుకు సంబంధించి పనులన్నింటికీ నవంబర్ 1 వరకు పూర్తిస్థాయి క్లియరెన్స్‌లు రానున్నాయి. తాము ఆశించినట్టు సేఫ్టీ క్లియరెన్స్ నిర్ణీత వ్యవధిలోగా వస్తుందని మెట్రోరైలు అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికే నాగోల్- మెట్టుగూడ, మియాపూర్-ఎస్సార్‌నగర్ వరకు రైల్వే సేఫ్టీ క్లియరెన్స్ లు వచ్చాయి. రెండు కారిడార్లకు సంబంధించిన పనులన్నింటినీ పూర్తిచేసి టెస్ట్ రన్ నిర్వహించనున్నారు. ఇంటర్‌చేంజ్ స్టేషన్‌తోపాటు బేగంపేట నుంచి అమీర్‌పేట్, ఎస్సార్ నగర్ నుంచి అమీర్‌పేట్ వరకు టెస్ట్ రన్ నిర్వహించి పూర్తిస్థాయిలో చెక్‌చేసిన తర్వాత ట్రయల్ రన్ చేపట్టనున్నారు. నవంబర్ 1 వరకు పూర్తిస్థాయి క్లియరెన్స్‌లు తీసుకొని 15వ తేదీ వరకు నాగోల్-మియాపూర్ మార్గాన్ని పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉంచాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు. .
ప్రయాణంలో వేగం, సౌకర్యానికి పెద్దపీట వేయనున్న మెట్రోరైలు ప్రయాణం అంతరాయం లేకుండా సాఫీగా సాగిపోయేందుకు అనేక ఏర్పాట్లు జరుగుతున్నాయి. ముఖ్యంగా మెట్రోరైలు నడిచేందుకు ఏర్పాటు చేసిన పవర్‌లైన్‌లో ఏదైనా సాంకేతిక లోపంతో పవర్‌కట్ అయితే క్షణాల్లో మరో రూట్‌నుంచి పవర్ అందే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకు ప్రత్యేక సబ్‌స్టేషన్లను ఏర్పాటు చేశారు. ఇప్పటికే సేఫ్టీ చెక్‌లో భాగంగా ఈ విధానాన్ని పరీక్షించారు. దీంతోపాటు సిగ్నలింగ్ వ్యవస్థను కూడా చెక్ చేశారు. ప్రయాణికుల సౌకర్యార్థం సేఫ్టీ విషయాలను పరిగణనలోకి తీసుకున్న మెట్రోరైలు అధికారులు రైలు బ్రేకింగ్ ఎలా ఉంది? జంపింగ్స్ వంటి ఇబ్బందులు ఉంటున్నాయా? ఇంజిన్ మోషన్ ఎలా ఉన్నది. వంటి అనేక అంశాలపై తనిఖీలు చేస్తున్నారు.
మరోవైపు మియాపూర్ మెట్రోస్టేషన్ ముస్తాబవుతున్నది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేతులమీదుగా మెట్రోరైలు ప్రాజెక్టును మియాపూర్ స్టేషన్ వేదికగా ప్రారంభించనున్న నేపథ్యంలో ఇక్కడ పనులన్నింటినీ వేగవంతం చేస్తున్నారు. మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు ఇక్కడ పనులన్నీ చకచకా కొనసాగుతున్నాయి. మూడు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ప్రధాని రాకకు 40 రోజులకు పైగా సమయం ఉండడంతో స్టేషన్ పరిసరాలను సర్వాంగ సుందరంగా మార్చడానికి మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ఆధ్వర్యంలో ఇంజినీర్లు పనులు చేపడుతున్నారు. ఇప్పటికే ఆపరేషన్స్ కు సంబంధించిన రేయిలింగ్, ఎలక్ట్రిఫికేషన్, సిగ్నలింగ్ వంటి అంశాలు పూర్తయినా, స్టేషన్ ప్రాంగణంలో ఏర్పాటు చేసే ఇతర సౌకర్యాలపై దృష్టి సారించారు.




