మియాపూర్: అత్తా, కోడళ్లు గొడవకు దిగడంతో సర్దిచెప్పేందుకు వెళ్లిన మామను కోడలు నెట్టివేయడంతో తలకు బలమైన గాయాలై మృతి చెందాడు. ఈ సంఘటన మంగళవారం మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్ఐ భరత్ నాయుడు కథనం మేరకు.. గోకుల్ ప్లాట్స్‌లో కృష్ణారావ్(60) భార్య సుశీలతో కలిసి నివాసం ఉంటున్నాడు. వారి కుమారుడు గోపీనాథ్, కోడలు నళిని కూడా వారి వద్దే ఉంటున్నారు.
మంగళవారం సుశీల, కోడలు నళిని గొడవ పడుతుండడంతో ఘర్షణను ఆపేందుకు కృష్ణారావ్ వారిని వారించడానికి ప్రయత్నించగా, నళిని తన మామను బలంగా నెట్టివేయడంతో కృష్ణారావ్ కింద పడిపోయాడు. దీంతో ఆయన తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.




