Thursday, 5 November 2026

యాసంగిలోనూ రైతులందరికీ పెట్టుబడి సాయం

హైదరాబాద్‌,మే9(జ‌నం సాక్షి): కోటి ఎకరాల పచ్చని మాగాణాన్ని చూడాలన్నదే లక్ష్యంగా ముఖ్యమంత్రి సంకల్పంతో పచ్చని తెలంగాణ వైపు అడుగులు వడివడిగా పడుతున్నాయి. కరువు రక్కసి బారిన పడి వలసలు పోయినచోటే ఇప్పుడు సిరుల పంటలు చూసి రైతన్నల కండ్లు ఆనందంతో మెరుస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడేనాటికి కేవలం 3.23 లక్షల ఎకరాలకు సాగునీరు అందేది. తెలంగాణ ఏర్పడిన తర్వాత కేవలం నాలుగేండ్లలోనే భారీ, మధ్యతరహాతోపాటు కొత్త చెరువులు, లిఫ్ట్‌ల స్కీంల ద్వారా అదనంగా 10.94 లక్షల ఎకరాలకు సాగునీరు అందించారు. ప్రాజెక్టుల కింద రెండు లక్షల ఎకరాలు, 
చెరువుల కింద మరో 11.61 లక్షల ఎకరాలు, లిప్ట్‌ స్కీంల కింద సుమారు 1.20 లక్షలకు పైగా ఆయకట్టు
స్థిరీకరించారు. యాసంగిలోనూ రైతులందరికీ పెట్టుబడి సొమ్ము అందజేసేందుకు సర్కారు సిద్ధమవుతున్నది. వానకాలంలో రైతుబంధు పథకం కింద ఎంతమందికి పెట్టుబడి సొమ్ము ఇస్తారో వారందరికీ యాసంగిలో కూడా అందజేయనున్నట్టు వ్యవసాయమంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డితోపాటు వ్యవసాయశాఖ ఉన్నతాధికారులు ఇప్పటికే ప్రకటించారు.  వాస్తవానికి వానకాలంతో పోలిస్తే యాసంగి సీజన్‌లో మూడోవంతు పంట మాత్రమే సాగవుతుంది. ప్రస్తుత వానకాలం సాధారణ సాగువిస్తీర్ణం 1.08 కోట్ల ఎకరాలు కాగా, యాసంగి విస్తీర్ణం 31.92 లక్షల ఎకరాలు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా యాసంగి నాటికి 8 లక్షల ఎకరాలు అదనంగా సాగయ్యే అవకాశాలున్నాయి. యాసంగిలో పెట్టుబడిసాయంపై సీఎం కేసీఆర్‌ త్వరలోనే అధికారికంగా ప్రకటన చేస్తారని వ్యవసాయశాఖ వర్గాలు పేర్కొన్నాయి.
—————————-