Thursday, 5 November 2026

క్రిమినల్‌ కేసులుంటే పంచాయితీ ఎన్నికల్లో అనర్హులు

కొత్త పంచాయతీరాజ్‌ చట్టానికి అనుగుణంగా నిబంధనలు

ఏకగ్రీవం కోసం వేలం వేసినా, ఓటర్లను కొనుగోలు చేసినా జైలు

కరదీపిక విడుదల చేసిన తెలంగాణ ఎన్నికల సంఘం

హైదరాబాద్‌,జూన్‌22(జ‌నం సాక్షి ): గ్రామపంచాయతీ పాలకవర్గాల గడువు మరో నెలలో ముగియ నుండడంతో ఈ నెల చివరి వారంలో ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చే అవకాశం ఉంది. ఆలోపే ఎన్నికలు నిర్వహించి కొత్త పాలకవర్గాన్ని ఎన్నుకునేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ ఎన్నికల్లో అక్రమాలకు చోటు లేకుండా ఉండేందుకు ఎన్నికల సంఘం నిబంధనలు కఠినతరం చేసింది. సర్పంచ్‌, వార్డు సభ్యులుగా పోటీ చేయాలనుకునే వారికోసం రాష్ట్ర ఎన్నికల సంఘం తాజాగా కరదీపికను విడుదల చేసింది. నామినేషన్‌ నుంచి మొదలు ఫలితాలు వెలువడే వరకు పాటించాల్సిన నియమ నిబంధనలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఉల్లంఘిస్తే శిక్షలను ఇందులో పొందుపరిచారు. క్రిమినల్‌ కోర్టు శిక్ష పడినవారు, ఐపీ పెట్టినవారు, ప్రభుత్వం కాంట్రాక్టు పనులు చేస్తున్నవారు స్థానిక ఎన్నికల్లో పోటీచేసేందుకు అనర్హులగా తెలంగాణ ఎన్నికల సంఘం పేర్కొంది. కొత్త పంచాయతీరాజ్‌ చట్టాన్ని అనుసరిస్తూ పలు నిబంధనలతో కూడిన కరదీపికను ఈసీ విడుదల చేసింది. ఏకగ్రీవం కోసం అభ్యర్థులు వేలం వేసినా, ఓటర్లను కొనుగోలు చేసినా జైలుశిక్షతో పాటు జరిమానా , అనర్హత వేటుకు గురయ్యే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించింది. మరోవైపు గ్రామ పంచాయతీ ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఈ సారి రిజర్వేషన్లలో కూడా భారీ మార్పులు జరిగే అవకాశం ఉండటంతో అంతా వాటి కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అటు ఎన్నికల సంఘం కూడా అభ్యర్థులు పాటించాల్సిన నిబంధనలను విడుదల చేసింది. పోటీ చేసే అభ్యర్థులు నిభందనలు పాటించక పోయినా, అజాగ్రత్తగా ఉన్నా అసలుకే ఎసరు వచ్చే అవకాశం ఉంది. మొత్తం విూద జిల్లాల్లో పంచాయతీ ఎన్నికల సందడి నెలకొంది. ఎన్నికల వ్యయాన్ని పర్యవేక్షించ డానికి, ఎన్నికల ఖర్చు నిమిత్తం ప్రతి అభ్యర్థి ఒక ప్రత్యేక బ్యాంకు ఖాతాను ప్రారంభించాలి. నామినేషన్‌ దాఖలు చేయడానికి ఒక రోజు ముందు ఈ ఖాతా ప్రారంభించాల్సి ఉంటుంది. నామినేషన్‌ దాఖలు చేసే సమయంలో అభ్యర్థి బ్యాంకు ఖాతా వివరాలను రిటర్నింగ్‌ అధికారికి లిఖిత పూర్వకంగా తెలపాలి.ఈ ఖాతా నుంచే అభ్యర్థి ఎన్నికల కోసం ఖర్చు చేయాల్సి ఉంటుంది. అభ్యర్థి తన సొంత నిధులతో పాటు ఇతరుల నుంచి వచ్చే నిధులను కూడా ఈబ్యాంకు ఖాతాలో వేసి వాటికి లెక్క చూపాల్సి ఉంటుంది.తుది జాబితాను తెలుగు అక్షరమాల క్రమంలో రిటర్నింగ్‌ అధికారి ప్రకటిస్తారు. సర్పంచ్‌, వార్డు సభ్యుడికి సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం గుర్తుల ప్రకటనను ముందుగా జారీ చేస్తుంది. ఈ గుర్తుల జాబితా నుంచి రిటర్నింగ్‌ అధికారి వరసగా అభ్యర్థులకు కేటాయిస్తారు. పోటీలో ఉన్న అభ్యర్థులకు తెలుగు అక్షర క్రమంలో ప్రకటించిన జాబితా ప్రకారమే గుర్తులు కేటాయిస్తారు. ఉదాహరణకు సర్పంచ్‌ పదవి కోసం పోటీ చేస్తున్న అభర్థుల జాబితాలో మొదటి వ్యక్తికి ఎన్నికల కమిషను ప్రకటించిన జాబితాలోని మొదటి గుర్తును కేటాయిస్తారు. రెండో అభ్యర్థికి రెండో గుర్తును కేటాయిస్తారు. ఇదే విధానం వార్డు సభ్యులకు వర్తిస్తుంది. ఇద్దరి పేర్లు ఒకే విధంగా ఉంటే నామినేషన్‌ వరస సంఖ్య ఆధారంగా గుర్తు కేటాయిస్తారు. బ్యాలెట్‌ పత్రంలో గుర్తుల కేటాయింపు పూర్తి అయ్యాక నోటా చేర్చుతారు. సర్పంచ్‌ లేదా వార్డు సభ్యుడుగా పోటీ చేయాలనుకునే వారికి సదరు గ్రామపంచాయతీ ఓటరు జాబితాలో పేరు నమోదై ఉండాలి. నామినేషన్ల పరిశీలన తేదీ నాటికి 21 సంవత్సరాల కన్నా తక్కువ వయస్సు ఉండరాదు. షెడ్యూలు తెగలకు రిజర్వు

చేసిన స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూలు తెగలుగా ప్రకటించిన ఏదేని కమ్యూనిటీకి చెందిన వారై ఉండాలి. షెడ్యూలు కులాలు, వెనుకబడిన తరగతుల రిజర్వు స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులు ప్రభుత్వం ప్రకటించిన సామాజికవర్గాలకు చెందిన వారై ఉండాలి. 18 ఏళ్లు పైబడి వయస్సు కలిగి ఉండి సంబంధిత అసెంబ్లీ సెగ్మెంట్‌లో ఓటరుగా నమోదై ఉన్న వారు మాత్రమే గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఓటు వేయడానికి అర్హత ఉంటుంది. నేర ప్రవృత్తి కలిగి ఉండి, నేరం చేసి క్రిమినల్‌ కోర్టు ద్వారా జైలుశిక్ష పడిన వారు. శిక్ష ముగిసిన తేదీ నుంచి ఐదు సంవత్సరాల కాలం వరకు అనర్హత వర్తిస్తుంది. 1955 పౌరహక్కుల పరిరక్షణ చట్టం ప్రకారం నేరానికి పాల్పడిశిక్ష పడిఉండరాదు.1994 తెలంగాణ పంచాయతీరాజ్‌ చట్టంలోని 19ఏ, 19బీ,20ఏ విభాగాల ప్రకారం అనర్హులై ఉండకూడదు.మతి స్థిమితం లేనివారు, చెవిటి, మూగవారు కూడా పోటీకి అనర్హులు. దివాలాతీసిన, దివాలాతనం నుంచి బయటకు రాలేని వ్యక్తిగా న్యాయస్థానం నిర్ణయించినవారు అయి ఉండరాదు. ఇందుకోసం దరఖాస్తు చేసుకున్నవారు కూడా అనర్హులే. గ్రామ పంచాయతీ, జిల్లా మండల పరిషత్తు లేదా ఏదేని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా కాంట్రాక్టు పొంది ఉండరాదు. పారితోషికం తీసుకుంటూ గ్రామపంచాయతీ తరఫున, లేదా వ్యతిరేకంగా లీగల్‌ ప్రాక్టీషనర్‌గా పని చేస్తూ ఉండరాదు. ప్రస్తుత లేదా గత ఆర్థిక సంవత్సరంలో గ్రామపంచాయతీకి బకాయి ఉండి, దానిపై నోటీసు ఇచ్చి దాని గడువు ముగిసినా బకాయి చెల్లించనివారు అనర్హులే. చట్టంలోని19(3) ప్రకారం ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలు కలిగి ఉన్నవారు అనర్హులు.

ఇకపోతే పోలింగ్‌ స్టేషన్‌కు వంద విూటర్ల లోపు ఏ వ్యక్తికూడా ప్రచారం చేయవద్దు. ఎన్నికల ప్రారంభానికి ఓ గంట ముందు మాత్రమే పోలింగ్‌ స్టేషన్‌కు ఏజెంట్లు వెళ్లాలి. ప్రతి ఓటరు భారత ఎన్నికల సంఘం జారీ చేసిన గుర్తింపుకార్డు, లేదా ఎన్నికల కవిూషన్‌ పేర్కొన్న ఏదేని గుర్తింపు కార్డును పోలింగ్‌స్టేషన్లో అధికారికి చూపించాలి. ఆదార్‌కార్డు, డ్రైవింగు లైసెన్సు, పాస్‌పోర్టు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థలు , స్థానిక సంస్థలు, పబ్లిక్‌ లిమిటెడ్‌ కంపనీలు జారీ చేసిన ఫొటోగ్రాఫులతో కూడిన గుర్తింపుకార్డులు, ప్రభుత్వరంగ బ్యాంకులు, తపాలా కార్యాలయం జారీ చేసిన ఫోటో పాసు పుస్తకాలు, ఆదాయపన్ను గుర్తింపుకార్డు, జాతీయ జనాభా నమోదు పథకం కింద భారత రిజిస్టార్ర్‌ జనరల్‌ జారీ చేసిన స్మార్టు కార్డులు, ఆరోగ్యబీమా కార్డులు, మాజీ సైనికోద్యోగుల పింఛను పుస్తకం, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ జారీ చేసిన ఫొటోతో కూడిన గుర్తింపు కార్డు, ఫోటోతో ఉన్న రేషన్‌కార్డు, ఫొటోతో కూడిన ఎస్సీ, ఎస్టీ, బీసీ ధ్రువపత్రాలు, స్వాతంత్య సమరయోధుల గుర్తింపు కార్డు, ఆయుధ లైసెన్సు, వికలాంగ ధ్రువపత్రం, ఫొటోతో ఉన్న పట్టాదారు పాసు పుస్తకాలు చూపించవచ్చు.