Thursday, 5 November 2026

క్రీడాకోటా వైద్యసీట్ల కుంభకోణంపై విచారణ

హైదరాబాద్‌,జూలై13(జ‌నం సాక్షి): క్రీడా కోటా వైద్య సీట్ల కుంభకోణంలో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. తాజాగా మరో కొత్త వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు శుక్రవారం రెండు చోట్ల అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు చేపట్టారు. ఎల్‌బీ స్టేడియంలోనూ, అటు వరంగల్‌లో ఉంటున్న తెలంగాణ జూడో అసోసియేషన్‌ సెక్రటరీ కైలాస్‌ యాదవ్‌ ఇంట్లోనూ సోదాలు జరిపారు. వరంగల్‌కు చెందిన ఓ వ్యక్తి తన కొడుకుకు స్పోర్ట్స్‌ కోటాలో మెడికల్‌ సీటు ఇప్పించేందుకు కైలాస్‌ యాదవ్‌ రూ.4లక్షలు అడిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే రూ.2లక్షలు చెల్లించిన సదరు వ్యక్తి.. మెడికల్‌సీట్ల కుంభకోణం వెలుగులోకి రావడంతో ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదుతో కైలాస్‌ యాదవ్‌ ఇంటితో సహా ఎల్బీ స్టేడియంలోని జూడో అసోసియేషన్‌ కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. కైలాస్‌ యాదవ్‌, శాట్స్‌ డిప్యూటీ డైరెక్టర్‌పైనా కేసు నమోదు చేశారు.