గిరిజన జీవితాల్లో వెలుగు నింపింది కేవలం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే

-గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్

మహబూబాబాద్ బ్యూరో-సెప్టెంబర్16(జనంసాక్షి)

గిరిజన జీవితాల్లో వెలుగు నింపింది కేవలం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమేనని రాష్ట్ర గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ అన్నారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పార్లమెంట్ సభ్యులు మాలోత్ కవిత, మహబూబాబాద్ శాసనసభ్యులు బానోత్ శంకర్ నాయక్, జిల్లా కలెక్టర్ కె.శశాంక లతో కలిసి మీడియా సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలలో భాగంగా ఈ నెల 17న హైదరాబాద్ లో నిర్వహిస్తున్న ఆదివాసి గిరిజన సమ్మేళనాన్ని దిగ్విజయం చేయాలని కోరారు. హైదరాబాదులో ఒక్కొక్కటి 22 కోట్లతో నిర్మించిన కొమరం భీం ఆదివాసి భవన్, సేవాలాల్ బంజారా భవన్ లను గౌరవ ముఖ్యమంత్రివర్యులు ఈనెల 17వ తేదీన ప్రారంభించిన అనంతరం ఎన్టీఆర్ స్టేడియంలో సభా కార్యక్రమం ఉంటుందని రాష్ట్రం నలుమూలల నుండి దాదాపు లక్ష 25 వేల మంది సభకు హాజరు కానున్నారని మన జిల్లా నుండి పదివేల 666 మంది సభకు హాజరవుతున్నట్లు మంత్రి తెలిపారు. 33 కులాల గిరిజన వివిధ కళారూపాలు, ప్రజాప్రతినిధులు, గిరిజన మేధావులు, విద్యావంతులు, మహిళలు ,ఇట్టి సభలో పాల్గొంటున్నారని మంత్రి తెలిపారు. పేద గిరిజన జీవితాలతో ముడిపడే విధంగా అభివృద్ధి సంక్షేమ పథకాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నదని మంత్రి అన్నారు. గిరిజనులు వారి ప్రాంతాలను వారే పాలించుకునే కలను గౌరవ ముఖ్యమంత్రివర్యులుసాకారం చేశారని తండాలను గ్రామపంచాయతీలుగా మార్చి గిరిజన బిడ్డలకు ఆత్మగౌరవం కల్పించారని మంత్రి అన్నారు. పోడు భూముల సమస్యలకు పరిష్కారం చూపేందుకు క్యాబినెట్ సబ్ కమిటీ నివేదిక అనుసరించి ప్రభుత్వం జీవో విడుదల చేసిందని త్వరలోనే లక్షలాది ఎకరాలకు పట్టాలు ఇవ్వనున్నామని మంత్రి తెలిపారు. గిరిజన ప్రాంతాలలో రోడ్ల అభివృద్ధి కై 1000 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. ఎస్పీ శరత్చంద్ర పవార్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్, జిల్లా పరిషత్ చైర్పర్సన్ కుమారి ఆంగోత్ బిందు, మున్సిపల్ చైర్మన్ డాక్టర్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.