Wednesday, 4 November 2026

గురుకులాల్లో పటిష్ట విద్యావిధానం

ఇటీవలి ఫలితాలే ఇందుకు నిదర్శనం
సామాన్యులకు కార్పోరేట్‌ విద్యను అందించడంలో ముందంజ
హైదరాబాద్‌,(జ‌నం సాక్షి): లక్షలు పోసి పెద్దపెద్ద కార్పొరేట్‌ చదువులు చెప్పించలేని పిల్లలకు గురుకులాలు ఒయాసిస్సులలాగా కనిపిస్తున్నాయి. అత్యున్నతా ప్రమాణాలతో కూడిన విద్యను ఇక్కడ  అందిస్తున్నారు. ప్రస్తుత సమాజంలో నిరుపేద విద్యార్థి ప్రైవేటు రంగంలో విద్యనభ్యసించాలంటే తలకు
మించిన భారంగా మారింది. ఏ తల్లిదండ్రులకైనా తమ పిల్లలకు మంచి భవిష్యత్‌ అందించాలనే ఆశ ఉంటుంది. దీని కోసం అప్పులు చేసి మరీ పిల్లలను ప్రైవేటు పాఠశాలల్లో చదివిస్తున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ప్రభుత్వం గురుకుల విద్యను బలోపేతం చేసే దిశగా పయనిస్తోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల పిల్లల కోసం గురుకులాలను విస్తృత పరుస్తోంది.. ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలల్లో ఏ విధమైన సౌకర్యాలు, విద్య లభిస్తుందో అంతకు రెట్టింపుగా వసతులు కల్పిస్తోంది. ఇటీవల వెలువడిన ఫలితాలు ఇవి ఎంత పటిస్టంగా నడుస్తున్నాయో చెబుతున్నాయి. ఫలితాల్లో వీరు ఎవరికీ తీసిపోరని రుజువు చేశారు. ఆరోగ్యకరమైన వాతావరణం.. రుచికరమైన భోజనం.. మంచి విద్యబోధన.. క్రీడలు.. విద్యార్థులకు ఇష్టమైన రంగాల్లో ప్రోత్సాహం. కళ్లముందు సాక్షాత్కరిస్తోంది.  మంచి భవిష్యత్‌ అందించేందుకు వీటిని తీర్చిదిద్దడంలో డిప్యూటి సిఎం కడియం శ్రీహరి కృతకృత్యులు అయ్యారు.  ఫలితంగా ఇక్కడ చదువు కునేందుకు విద్యార్థులు ఆసక్తి కనబరుస్తున్నారు. తమ పిల్లల భవిష్యత్‌ బంగారం కాబోతోందని తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నాణ్యమైన భోజనం కొత్తకొత్త భవనాలు, మినరల్‌ వాటర్‌, దుస్తులు, ఇతర సౌకర్యాలను ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది.. ఐదవ తరగతి నుంచి డిగ్రీ వరకు ఉచిత విద్యను.. అది కూడా ఇంగ్లిష్‌ విూడియంలో అందిస్తోంది. కార్పొరేట్‌ స్థాయి ప్రమాణాలను తలదన్నే రీతిలో గురుకుల పాఠశాలలు పనిచేస్తున్నాయనడానికి నిదర్శనం పూర్ణ, ఆనంద్‌ ఎవరెస్ట్‌ శిఖరాన్ని అధిరోహిం చడమే. జిల్లాలు, రాష్ట్రాలు దాటి జాతీయ, అంతర్జాతీయస్థాయి క్రీడల్లో గురుకుల విద్యార్థులు రాణించడమే కాకుండా సాహసోపేతమైన యాత్రలను సైతం ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది.. ఈ క్రమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ఆనంద్‌, నిజామాబాద్‌ జిల్లాకు చెందిన మాలావత్‌ పూర్ణలు గురుకుల కళాశాలలో ఇంటర్‌ చదువుతూ ఎవరెస్ట్‌ను అధిరోహించి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఒకప్పుడు సౌకర్యాల లేమితో అరకొర చదువులు కొనసాగేవి. మెనూలోనూ పెద్దగా మార్పులు ఉండేవి కాదు. కానీ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చాక గురుకుల పాఠశాలల దశ మారింది. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సైతం ఆసక్తి కనబరుస్తున్నారు. ఆడుకునేందుకు అవసరమైన ఆట వస్తువులు, విశాలమైన క్రీడా మైదానం కేవలం ప్రభుత్వ గురుకుల పాఠశాలలకే సొంతం అనడంలో ఎలాంటి సందేహం లేదు. సన్నబియ్యంతో పాటు చికెన్‌, మటన్‌, కోడిగుడ్డు, అరటిపండ్లు వంటి అన్ని పోషక విలువలతో కూడిన చక్కటి రుచికరమైన ఆహారం అందిస్తున్నారు. విద్యార్థులుకు ఉపయోగించే పెన్నులు, పెన్సిళ్లు, రికార్డు పుస్తకాలు, పాఠ్యపుస్తకాలు, నోట్‌ పుస్తకాలను పంపిణీ చేస్తున్నారు. మూడు జతల స్కూల్‌ యూనిఫాం ప్రభుత్వమే సరఫరా చేస్తోంది.డ్రెస్‌, ట్రాక్‌సూట్‌, స్పోర్ట్స్‌ షూస్‌ ఉచితం. గ్లాసులు, బెడ్‌షీట్లు, పరుపులు, దిండ్లు, బ్లాంకెట్లు, ట్రంక్‌ బాక్సులు విద్యార్థులకు కాస్మొటిక్‌ కిట్‌ ద్వారా పలు రకాల వస్తువులను అందచేస్తున్నారు. అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు విద్యా విహారయాత్రలకు అవకాశం ఇస్తున్నారు. సమర్థులైన, సుదీర్ఘ అనుభవం కలిగిన ఉపాధ్యాయుల బోధనతో పాటు 24 గంటల పాటు ఉపాధ్యాయుల పర్యవేక్షణలో ఉంటుంది. విద్యార్థుల సమస్యలు ఎప్పటికప్పుడు తెలుసుకుని పరిష్కరించడానికి హౌస్‌ మాస్టర్‌, హౌస్‌ పేరెంట్‌ వ్యవస్థ ఉంటుంది. పాఠ్యాంశాలతో పాటు సహ పాఠ్యాంశాలు, మార్షల్‌ ఆర్ట్స్‌, లలిత కళలు, యోగా , క్రీడలు, శారీరక విద్య, కరాటేలలో ప్రత్యేక శిక్షణ తదితర వాటిపై అవగాహన కల్పిస్తారు. ఐఐటీ, ఎంసెట్‌, నీట్‌ వంటి జాతీయస్థాయి పోటీ పరీక్షలకు శిక్షణ ఇస్తారు. విద్యార్థుల్లో ప్రతిభను గుర్తించి ప్రోత్సహించేలా బహుమతులు అందిస్తారు. పోషకాహారం, పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, యూనిఫాం లైబ్రరీ, టీవీ, ప్రొజెక్టర్‌, ఫీల్డ్‌ ట్రిప్స్‌ ఇతర సౌకర్యాలను కల్పిస్తారు.