Tuesday, 3 November 2026

గొలుసు దొంగలు

బర్కత్‌పుర : వినాయక నిమజ్జనోత్సవాలను ఆసరా చేసుకుని గొలుసు దొంగలు తెగబడ్డారు. కాచిగూడ నుండి ఛాదర్‌ఘాట్‌ వెళ్లే ప్రధాన మార్గంలో నడిచి వెళుతున్న ఓ మహిళ మెడలోనుండి మూడు తులాల మంగళసూత్రాన్ని తెంచుకెళ్లారు. స్థానిక హిందూ స్మశాన వాటికలో స్వీపర్‌గా పనిచేసే అర్రాస్‌పెంట హన్‌మాన్‌ దేవాలయం ప్రాంతానికి చెందిన ఎన్‌.పద్మ(40) ఆదివారం ఉదయం 9గంటలకు నడుచుకుంటూ వెళుతుండగా పల్సర్‌ మోటార్‌సైకిల్‌పై ఎదురుగా వచ్చి ఈ దురాగతానికి పాల్పడ్డారు. వెంటనే ఆమె కాచిగూడ పీఎస్‌లో ఫిర్యాదుచేసింది. స్మశాన వాటిక ప్రాంగణంలో ఉన్న సీసీ కెమెరాలలో నిందితుల బైక్‌పై వెళుతున్న దృశ్యాలు కనిపించాయని పోలీసులు తెలిపారు.
అమీర్‌పేట: ఎస్సార్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధి బికేగూడలోని చాణక్యనగర్‌లో శ్రీకాకుళం జిల్లా పొందూరుకు చెందిన ఎ. కళ్యాణి మెడలోని పుస్తెలను పల్సర్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు గుంజుకుని పరారయ్యారు. ఆదివారం ఉదయం పార్కు సమీపంలో ఉన్న మెడ్‌ప్లస్‌ మెడికల్‌ షాపుకు వెళ్లి మందులు కొనుగోలు చేసి ఇంటికి వస్తుండగా ఈ ఘటన జరిగింది. దుండగల ముఖాలకు ఖర్చీఫ్‌లు కట్టుకుని ఉన్నట్లు బాధితురాలు పేర్కొంది. తొలుత అగంతకులు ఆమె మెడలోని పుస్తెలతాడును తెంపుకునేందుకు యత్నించగా ఆమె తీవ్రంగా ప్రతిఘటించి కెకలు వేసింది. స్థానిక టీఆర్‌ఎస్‌ నాయకుడు కరుణాకర్‌ రెడ్డి పరుగెత్తుకు రావడంతో దొంగలు అర తులం బరువున్న బంగారు మంగళసూత్రాన్ని గుంజుకుని పరారయ్యారు. నాలుగు తులాల పుస్తెలతాడును ఆమె గట్టిగా పట్టుకోవడంతో నిలిచింది ఈ ఘటలో ఆమె మెడకు స్వల్ప గాయం అయింది. ఎస్‌ఐ అజయ్‌ కుమార్‌ వచ్చి పరిశీంచగా ఘటన స్థలంలో దొరికిన డ్రైవింగ్‌ లైసెన్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.
రాంనగర్‌: నడుచుకుంటూ వెళ్తున్న నర్సింహబస్తీకి చెందిన మహేశ్వరి (35) మెడలోని రెండున్నర తులాల బంగారు గొలుసును లాక్కొని పారిపోయారు. బాధితురాలు నల్లకుంట పీఎస్‌లో ఫిర్యాదు చేయగా సీఐ సంతోష్‌కిరణ్‌ పర్యవేక్షణలో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *