క్షేత్రస్థాయిలో ప్రచారానికి సన్నాహాలు
ఏడాదంతా ఎన్నికల తరహా ప్రచారానికి టిఆర్ఎస్ ప్లాన్
హైదరాబాద్,మే28(జనం సాక్షి): టిఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలపై వారిలో చైతన్యం తీసుకువచ్చేందుకు క్షేత్రస్థాయిలో ఉండే పార్టీ నాయకులు, కార్యకర్తలకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నది. ఈ ఏడాదిలో మొదలు పెట్టి వచ్చే ఎన్నికల వరకు నిరంతరగాయంగా కార్యక్రమాలు అమలు చేయాలని చూస్తున్నారు. వచ్చే ఏడాదికాలం పార్టీకి, ప్రభుత్వానికి అత్యంత కీలకమైనది. పంచాయతీ ఎన్నికలు, అసెంబ్లీ, లోక్‌సభ సాధారణ ఎన్నికలు ఇదే ఏడాదిలో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ క్యాడర్‌కు ప్రభుత్వ పథకాలపై చైతన్యం, అవగాహన తీసుకురావడం ద్వారా ఎన్నికల్లో గెలుపు సునాయాసం అవుతుందని అంచనా వేస్తున్నారు. పంచాయతీ, సాధారణ ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుతం ప్రజల్లో పార్టీపట్ల ఉన్న సానుకూల వైఖరిని సద్వినియోగం చేసుకునేలా ఆలోచనలు చేస్తున్నారు. ప్రభుత్వ పథకాలు గ్రామ స్థాయిలో మరింత సమర్థంగా అమలుచేయడం, ప్రభుత్వ ఉద్దేశాలను, లక్ష్యాలను విస్తృతంగా ప్రచారం చేయడం, ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఎలాంటి అపోహలు లేకుండాచేయడం, గ్రామస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో బూత్ కమిటీల శిక్షణా శిబిరాలకు శ్రీకారం చుడుతున్నారు.గ్రామస్థాయిలో ప్రతి కార్యక్రమాన్ని చేరవేయాలని నిర్ణయించారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో అనేక పథకాలు ప్రతిష్టాత్మకంగా అమలవుతున్నాయి. పథకాల గురించి ప్రజలకు మరోసారి వివరించడంతో పాటు, ప్రభుత్వం ఇచ్చిన నిధులు, వాటిద్వారా లబ్ధిపొందినవారి వివరాలను వివరించనున్నారు. అదేవిధంగా పథకాల అమలులో క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చేందుకు కూడా ఉపయోగ పడుతాయని భావిస్తుంది. బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగంగా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని టీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది. అందుకు గులాబీ శ్రేణులను ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధులుగా తీర్చిదిద్దాలని నిర్ణయించింది. క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్‌ను సన్నద్ధం చేయడంపై దృష్టి సారించింది. ప్రభుత్వపరంగా చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలపై విస్తృత ప్రచారంతో పాటు.. పథకాలపై చైతన్యం తీసుకువచ్చేందుకు క్షేత్రస్థాయిలోని పార్టీ నాయకులు, కార్యకర్తలకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల వద్దకు చేర్చడం పార్టీ నాయకులు, కార్యకర్తల బాధ్యత. ఈ నేపథ్యంలో పార్టీ క్యాడర్ మరింత చురుకుగా, సమయస్ఫూర్తితో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. అందుకు టీఆర్ఎస్ మండల, గ్రామ బూత్ కమిటీల బలోపేతం దిశగా ప్రభుత్వం ముందుకెళ్తోంది. బూత్ కమిటీలో ఒక్కొక్కరు 100 మంది చొప్పున ప్రజలకు ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పిస్తారు. పథకాలపై ఎలాంటి అనుమానాలు, సందేహాలు నివృత్తి చేయడం, అర్హులు దరఖాస్తు చేసుకునేలా ప్రోత్సహించి.. లబ్ధిపొందేలా చేస్తారు. కిందిస్థాయిలో ఇలాంటి వ్యవస్థ బలోపేతంగా ఉంటే ప్రభుత్వం, పార్టీపై జరిగే తప్పుడు ప్రచారానికి కూడా సులభంగా చెక్ పెట్టొచ్చని ప్రభుత్వం భావిస్తోంది.రాష్ట్రస్థాయిలో ఒక పిలుపు ఇస్తే అది గ్రామస్థాయిలో ఉండే బూత్ కమిటీలకు చేరుకోవడం ద్వారా సీఎం కేసీఆర్ ఆశించిన బంగారు తెలంగాణ సాధించడం సులువనే భావనలో ఈ కమిటీలకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు కార్యాచరణ చేపట్టనున్నారు.




