ధర్మపురి జనంసాక్షి :- జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన దక్షిణ కాశీగా పేరొందిన ధర్మపురి శ్రీ లక్ష్మినరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా మరియు హోలి పౌర్ణమి సందర్భంగా మంగళవారం ఉదయం నుండి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అధికసంఖ్యలో భక్తులు ఉదయం నుండే స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయాలన్ని భక్తులతో కిటకిటలాడాయి. బ్రహ్మోత్సవాలతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ఆలయ ప్రాంగణం లక్ష్మి నరసింహస్వామి గోవిందా గోవిందా నామస్మరణలతో మారుమోగింది. సాయంత్రం 4 గం||లకు స్థానిక బ్రహ్మపుష్కరిణి (కోనేరు) లో శ్రీ యోగా నరసింహస్వామి వారి తెప్పోత్సవం వేదమంత్ర పఠనాలు, మంగళవాయిద్యాలు, భక్తజనుల జయజయధ్వానాలు, గోవిందనామస్మరణ ల మధ్య ఘనంగా జరిగింది. అనంతరం బ్రహ్మపుష్కరిణి మంటపంలో శ్రీ యోగా నరసింహస్వామి డోలోత్సవం ఘనంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు బ్రహ్మపుష్కరిణి కి చేరుకొని గోవింధ నామస్మరణ చేస్తూ స్వామి వారిని దర్శించుకున్నారు. శ్రీ యోగా నరసింహస్వామి వారి తెప్పోత్సవం, డోలోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులు గా **** హాజరయ్యి స్వామివారిని దర్శించుకున్నారు. ధర్మపురి పరిసర ప్రాంతాలతో పాటు, సుదూర ప్రాంతాలైన మహారాష్ట్ర, నిజామాబాద్, ఆర్మూర్, నిర్మల్ వివిధ ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున భక్తులు వచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా ఆన్నదాన కార్యక్రమం, త్రాగునీరు, మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశారు. ఆర్టీసీ వారు భక్తులకు అసౌకర్యం కలగకుండా భక్తుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక బస్సు లను ఏర్పాటు చేశారు.
తెప్పోత్సవం, డోలోత్సవ తిలకించేందుకు 6 డిజిటల్ స్క్రీన్ లు
జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవతో ఏర్పాటు
ధర్మపురి బ్రహ్మోత్సవాలలో ముఖ్యగట్టమైన
శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి కళ్యాణ మహోత్సవాన్ని,తెప్పోత్సవం, డోలోత్సవ భక్తులందరూ తిలకించేందుకు వీలుగా జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష మార్గదర్శనం మేరకు ధర్మపురి పట్టణంలో పెద్ద సంఖ్యలో ప్రత్యేక డిజిటల్ స్క్రీన్ లను ఏర్పాటు చేశారు.ఆలయంలో కల్యాణాన్ని వీక్షించేందుకు మరియు తెప్పోత్సవం, డోలోత్సవ భక్తులందరికీ అవకాశం లేకపోవడంతో ఈ అపురూప ఘట్టాన్ని ప్రజలంతా ప్రత్యక్ష ప్రసారాలు ద్వారా తిలకించేందుకు వీలుగా ఈ స్క్రీన్ లను ఏర్పాటు చేశారు.ఆలయం లోపల రెండు ,ఆలయం బయట ఒకటి,ఇసుక స్తంభం వద్ద ఒకటి, నంది విగ్రహం వద్ద ఒకటి, మంగళ్లి ఘాటు వద్ద ఒకటి ఇలా మొత్తం ఆరు ప్రత్యేక డిజిటల్ స్క్రీన్ లను ఏర్పాటు చేశారు.




