హైదరాబాద్,మే2( జనం సాక్షి): హైదరాబాద్ పాతబస్తీలో బుధవారం షబ్బె బరాత్ వేడుకలను ముస్లింలు ఘనంగా నిర్వహించుకున్నారు. నగరంలోని పాతబస్తీ తదితర ప్రాంతాల్లో లో షబ్బె బరాత్ వేడుకలు ముస్లిం సోదరులు ప్రశాంతంగా నిర్వహించారు. రంజాన్‌కు 14 రోజుల ముందు షబ్బె భరాత్ ప్రార్థనలు చేస్తారు. చార్మినార్, మక్కామసీద్, మదీనా తదితర ప్రాంతాల్లో ముస్లింలు ప్రార్థనలు చేశారు. ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో హాజరై ప్రార్థనల్లో పాల్గొన్నారు.ఈ వేడుకల అనంతరం స్మశాన వాటికలను సందర్శించి దువాలు నిర్వహించారు. షబ్బె బరాత్ సందర్భంగా నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ పాతబస్తీలోని చార్మినార్, మదీన, మక్కమసీద్‌తో పాటు నగరంలోని సమస్యాత్మకమైన ప్రాంతాల్లో రాత్రంతా పర్యటించారు. మక్కామసీదు లోపలకి వెళ్లి ముస్లిం సోదరులను పలకరించారు. ముస్లిం సోదరులకు సీపీ షబ్బెబరాత్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ..ప్రతి జోన్ లో సీనియర్ అధికారి పర్యవేక్షణలో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. స్పెషల్ డ్యూటీలు, మొబైల్ సిబ్బంది ద్వారా బందోబస్తును ప్రత్యేకంగా ఏర్పాటు చేశామన్నారు.




