Monday, 2 November 2026

చట్టం పేరుతో మహిళల స్వేఛ్చను హరించవద్దు

యాదాద్రి అరెస్ట్‌లపై హైకోర్టు వ్యాఖ్య
హైదరాబాద్‌,నవంబర్‌29(జ‌నంసాక్షి):  చట్టం పేరుతో మహిళల జీవించే స్వేచ్ఛను అడ్డుకునే ప్రయత్నం చేయొద్దని హైకోర్టు హెచ్చరించింది. ఇటీవల యాదాద్రికి చెందిన నలుగురు మహిళలపై పోలీసులు పీడీ యాక్ట్‌ ప్రయోగించిన కేసుకు సంబంధించి గురువారం హైకోర్టు ధర్మాసనం తీర్పు వెలువరించింది. వ్యభిచారాన్ని తీవ్రమైన నేరంగా పరిగణించలేమని, అలాంటి కేసులపై పీడీ యాక్ట్‌ ప్రయోగం అర్థరహితమని హైకోర్టు స్పష్టం చేసింది. యాదాద్రిలో వ్యభిచార గృహాలు నిర్వహిస్తున్న వారిని పట్టుకుని వారిపై పీడీ యాక్ట్‌ ప్రయోగించడమే కాకుండా మహిళలను నిర్బంధించి జైలులో ఉంచడాన్ని న్యాయమూర్తి తప్పు పట్టారు. చట్టం అమలు చేసేటప్పుడు సహేతుకత పాటించాలని సూచించారు. చిన్నపిల్లల్ని వ్యభిచార కూపంలోకి దింపుతున్నారని ఆరోపిస్తూ ఇటీవల.. యాదాద్రికి చెందిన నలుగురు మహిళలపై పోలీసులు పీడీ యాక్ట్‌ ప్రయోగించి అరెస్టు చేశారు. దీన్ని సవాల్‌ చేస్తూ మహిళ తరపున బంధువులు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను పరిశీలించిన ధర్మాసనం పోలీసుల తీరును తప్పు పట్టింది. అలజడులు, అశాంతికి కారణమయ్యే తీవ్రమైన నేరాలు జరిగిన సందర్భాల్లోనే నిందితులపై ఈ చట్టాన్ని ప్రయోగించాలని గుర్తు చేసింది.