హైదరాబద్ సిటీ, ఆగస్టు 27 జనం సాక్షి : రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర హోం మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ అన్నారు.
శనివారం ఎస్.ఆర్.డి.పి పథకం ద్వారా రూ. 45.87 కోట్ల వ్యయంతో చేపట్టిన చాంద్రాయణగుట్ట విస్తరణ ఫ్లై ఓవర్ బ్రిడ్జిని చాంద్రాయణగుట్ట శాసనసభ్యులు అక్బరుద్దీన్ ఓవైసీ, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి లతో కలిసి రాష్ట్ర హోమ్ మంత్రి మహమ్మద్ మహబూబ్ అలీ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో హోమ్ మంత్రి మాట్లాడుతూ… జిహెచ్ఎంసి పరిధిలో రవాణా వ్యవస్థను మెరుగు పరిచేందుకు ఎస్.ఆర్.డి.పి ద్వారా 47 పనులు చేపట్టారు. ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఫ్లై ఓవర్లు, ఆర్ ఓ బి లు, ఆర్ యు బి లు చేపట్టి సిగ్నల్ ఫ్రీ నగరంగా అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. ఒక్కరు కూడా ఆకలితో అలమటించకూడదనే ముఖ్యమంత్రి సంకల్పంతో పేదలకు రూ. 5/- అన్నపూర్ణ భోజనం పంపిణీ ని 150 కేంద్రాల ద్వారా ఒక్కో కేంద్రంలో 300 భోజనాల చొప్పున రోజుకు 45వేల భోజనాలు అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో లాక్ డౌన్ సందర్భంగా జిహెచ్ఎంసి పరిధిలో రెండు పూటలు మధ్యాహ్నం, రాత్రి సమయంలో ఈ అన్నపూర్ణ పథకం ద్వారా ఉచితంగా భోజనం పంపిణీ చేసినట్లు మంత్రి వివరించారు. ఈ పథకం ప్రారంభమైనప్పటి నుండి జూన్ 2022 వరకు 9కోట్ల 76 లక్షల మందికి పంపిణీ చేసినట్లు అందుకు 188 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు.
రవాణా సౌకర్యాలు మెరుగు పరచడానికి జిహెచ్ఎంసి నలువైపులా ఫ్లై ఓవర్లు చేపట్టారు. చాంద్రాయణగుట్ట ఫ్లై ఓవర్ తో 15 అందుబాటులోకి వస్తాయని అన్నారు. ఉప్పల్ నుండి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వెళ్లేందుకు సులభతరం అవుతుందన్నారు. ఆసరా పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి, షాది ముభారక్, ఒంటరి మహిళ పింఛన్లు నెలకు రూ. 2016 అందిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశంలో ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకొని ఆ రాష్ట్రాల్లో అమలుకు చర్యలు తీసుకోవడం జరుగుతున్నట్లు హోమ్ మంత్రి మహమూద్ అలీ అన్నారు.
ఈ కార్యక్రమంలో హైదరాబాద్ పార్లమెంటు సభ్యులు అసదుద్దీన్ ఓవైసీ, ప్రాజెక్టు సి ఇ దేవానంద్, ఎస్.సి దత్తు పంత్, కార్పొరేటర్లు చాంద్రాయణగుట్ట, ఉప్పుగూడ, జంగం మెట్, అబ్దుల్ వహాబ్, ఫహాద్ బిన్ అబ్దుల్ సమీద్ బిన్ అబ్ధత్, మొహమ్మద్ అబ్దుర్ రెహమాన్, జోనల్ కమిషనర్ సామ్రాట్ అశోక్ డి సి లు తదితరులు పాల్గొన్నారు.




