మిగిలిన పని పూర్తి చేసేలా కార్యాచరణ
గిరిజనులకు కూడా చెక్కుల పంపిణీ
హైదరాబాద్,మే29(జనం సాక్షి ):రైతుబంధు పథకం చెక్కులు, పట్టాదార్ పాస్‌పుస్తకాల పంపిణీని వందశాతం పూర్తి చేసేందుకు అధికారులను మళ్లీ గ్రామాల్లో పర్యటించాలని ప్రభుత్వం ఆదేశించింది. జూన్ 20 నాటికి పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని సూచించింది. జిల్లాలవారీగా పర్యవేక్షణకు సీనియర్ ఐఏఎస్ అధికారులను ప్రత్యేకాధికారులుగా నియమించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు తిరిగి ప్లలెబాట పట్టారు. మిగిలిన చెక్కులు, పట్టాదార్ పాస్‌పుస్తకాల పంపిణీతోపాటు.. వాటిలో దొర్లిన తప్పులను గుర్తిస్తున్నారు. తప్పులను సరిదిద్దుతూ కొత్తవి అందజేస్తూ, ప్రభుత్వానికి నివేదికలు సమర్పిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1.14 కోట్ల ఎకరాల సాగుభూమికి సంబంధించి 58.33 లక్షల మంది రైతులకు సుమారు 59
లక్షల చెక్కులు, 49 లక్షల 94 వేల 937 పట్టాదార్ పాస్‌పుస్తకాలను పంపిణీచేయాల్సి ఉన్నది. ఈ నెల 10వ తేదీ నుంచి 17వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన గ్రామసభల్లో 44 లక్షల చెక్కులు, 40 లక్షల 76 వేల 901 పట్టాదార్ పాస్‌పుస్తకాల పంపిణీ జరిగింది. వివిధ కారణాలతో 14.33 లక్షల చెక్కులు, 9 లక్షల 18
వేల పట్టాదార్ పాస్‌పుస్తకాలను అందుకోలేకపోయారు. ఇప్పుడు అధికారులు మళ్లీ గ్రామాలకు వెళ్లి పంపిణీలో నిమగ్నమయ్యారు. ఇదిలావుంటే రైతుబంధు పథకం అడవి బిడ్డల జీవితాల్లో వెలుగులు నింపుతోంది. పోడుభూములు సాగుచేసుకుంటున్న వారికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం వర్తింప జేసింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో రెండు వేల ఏజెన్సీ గ్రామాలకు చెందిన గిరిజన రైతులకు 92 వేల 649 చెక్కులను ప్రభుత్వం అందజేసింది. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, నల్లగొండ, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో గిరిజన రైతులకు ఈ నెల 21 నుంచి మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు చెక్కులను అందజేశారు. ఒక్కరోజే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 16 మండలాల పరిధిలో 189 గ్రామాల్లో 27.86 కోట్ల విలువైన 13,248 చెక్కులను అధికారులు పంపిణీ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలంలోని ఐదు రెవెన్యూ గ్రామాల పరిధిలోని 33 గిరిజన గూడేల్లో ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు కలిగిన 1,466 మందికి 2.37 కోట్ల విలువైన చెక్కులను ఎమ్మెల్యే జలగం వెంకట్రావు అందజేశారు.
ఏజెన్సీ ప్రాంతాల్లో అటవీ సరిహద్దుల ఆధారంగా చెక్కులను ముద్రించడంతో గ్రామాలను గుర్తించడం స్థానిక అధికారులకు ఇబ్బందిగా మారింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు అటవీ అధికారులను వ్యవసాయ శాఖ అధికారులు సంప్రదిస్తూ సవిూప రెవెన్యూ గ్రామాలను గుర్తించి చెక్కుల పంపిణీకి ఏర్పాట్లు చేపట్టారు. ఇదో కీలకమైన మలుపు అని మంత్రి చందూలాల్ అన్నారు. గిరిజనులకు కూడా చెక్కులు దక్కడం మంచి పరిణామమని అన్నారు.
————




