– ట్విట్టర్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్
హైదరాబాద్, జులై7(జనం సాక్షి) : అర్జెరటీనా మార్క్సిస్ట్, క్యూబా విప్లవకారుడు చేగువేరా ప్రభావం తన జీవితంపై ఉందని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ అన్నారు. ఆయన శనివారం చేగువేరా విగ్రహం పక్కన తన కుమార్తె పొలినా అంజని దిగిన ఫొటోను ట్విటర్ వేదికగా పంచుకున్నారు. ఇది సెయింట్ పీటర్ బర్గ్ మ్యూజియంలో తన కుమార్తె చేగువేరా మైనపు విగ్రహంతో దిగిన ఫొటో అని చెప్పారు. నెల్లూరులో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నప్పుడు చేగువేరా జీవితం గురించి చదివానని, ఇప్పటికీ చదువుతున్నానని తెలిపారు. ఆయన ప్రభావం తన జీవితంపై ఉందని పేర్కొన్నారు. ప్రపంచంలో అరాచకం, దోపిడీ, నిరంకుశత్వం ఉన్న వ్యవస్థల వల్ల ప్రజలు తీవ్ర బాధలు పడుతున్నప్పుడు.. నువ్వు ఆ దేశపు మనిషివి కానప్పటికీ.. నీకు వ్యక్తిగతంగా ఏమి జరగనప్పటికీ.. నువ్వు పెరిగిన దేశపు, సమాజపు హద్దులను చెరిపేసి ప్రపంచ పీడిత ప్రజలకి అండగా నిలబడాలి అనే విషయాన్ని నేను చేగువేరా జీవితం నుంచి నేర్చుకున్నానని తెలిపారు. జీవితం అంతిమ క్షణాల వరకూ తాను నమ్మిన సిద్ధాంతంతోనే నడిచి చూపించిన విశ్వనరుడు చేగువేరా అని కొనియాడారు. అందుకేనేమో దశాబ్దాల క్రితం, ఎక్కడో దక్షిణ అమెరికాలోని అర్జెటీనాలో పుట్టి పెరిగి, క్యూబా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాలలో పోరాటాలు చేసిన చేగువేరా చిత్రం ఉత్తరాంధ్రలోని ఓ మూలకి విసిరినట్టుండే ఇచ్ఛాపురంలో స్వేచ్ఛామాత గుడికి వెళ్లే వీధికి ఎదురుగా ఒక మహనీయుడి చెప్పుల దుకాణంపైన నాకు దర్శనమిచ్చింది అంటూ అని పవన్ పేర్కొన్నారు.




