ఓడిపోతే చంద్రబాబు గుట్టు తెలుస్తుంది

– అందుకే బాబుకు భయం పట్టుకుంది

– రాయలసీమ అభివృద్ధికి చంద్రబాబు సైందవుడిగా మారాడు

– 70శాతం పూర్తయిన గాలేరు నగరి-హంద్రీనీవా ప్రాజెక్టులను పక్కన పడేశారు

– ఏపీకి నిధులిస్తున్నా కేంద్రంపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారు

– కేంద్రం సాయాన్ని ప్రజలకు వివరిస్తాం

– విలేకరుల సమావేశంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ

కడప, జులై7(జ‌నం సాక్షి) : చంద్రబాబుకు ఓట్ల భయం పట్టుకుందని, ఎన్నికల్లో ఓడిపోతే చేసిన తప్పులు, అవినీతి సొమ్ముతో పెట్టిన పెట్టుబడులు, తన చీకటి వ్యాపారం అంతా బయట పడతాయనే చంద్రబాబు బీజేపీ నేతలపై నిందలు వేస్తున్నారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. లక్ష్మీనారాయణ కడప జిల్లాలో పర్యటిస్తున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా శనివారం తిరుపతి-రాజంపేట విూదుగా ఆయన కడపకు చేరుకున్నారు. కాగా, బీజేపీపై ఉన్న వ్యతిరేకతతో ఈ పర్యటనను అడ్డుకుంటారన్న సమాచారంతో సీపీఐ నేతలను ముందుస్తుగానే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా శనివారం ఆయన విూడియాతో మాట్లడారు. రాయలసీమ ప్రజలు ఓట్లు వేయలేదని సైంధవుడిలా చంద్రబాబు వారి అభివృద్ధిని అడ్డుకుంటున్నారని పేర్కొన్నారు. 70 శాతం పూర్తయిన గాలేరు నగరి-హంద్రీనీవా ప్రాజెక్టులను పూర్తి చేయకుండా ఏడాదికేడాదికి వాటి అంచనా వ్యయాలను పెంచుకుంటూ పోతూ కవిూషన్లు దండుకుంటున్నారని చంద్రబాబు పై లక్ష్మీనారాయణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్ర అభివృద్ధి కేంద్రం అన్ని విధాల సహకరిస్తున్నా, సహకరిస్తామని చెబుతున్నా చంద్రబాబు మొండితనంతో ముందుకెళ్తూ ఏపీని ఇబ్బందుల్లో పడేస్తున్నారని అన్నారు. రాష్ట్రానికి అత్యధిక నిధులు ఇచ్చినా వాటిని తీసుకొని కేంద్రాన్ని విమర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఏపీలో బీజేపీ నేతలపై దాడులకు పాల్పడుతున్నారని, టీడీపీ నేతలు తీరుమార్చుకోకపోతే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని కన్నా లక్ష్మీనారాయణ హెచ్చరించారు. కడపకు స్టీల్‌ ప్లాంట్‌ ఇస్తామని కేంద్రం ఎప్పుడో చెప్పిందని, కానీ ఇన్నాళ్లు తెదేపా అడ్డుంకులు సృష్టించి ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో స్టీల్‌ ప్లాంట్‌ అంటూ దొంగదీక్షలు చేస్తుందని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో తెదేపాకుగుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఈకార్యక్రమంలో బీజేపీ నేతలు పాల్గొన్నారు.