Wednesday, 4 November 2026

జంటనగరాల్లో జోరుగా ఇళ్ల నిర్మాణాలు

విమర్శలు చేసే వారు పరిశీలన చేస్తే మంచిది: తలసాని

హైదరాబాద్‌,జూలై6(జ‌నం సాక్షి): డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇల్ల నిర్మాణాలపై విపక్షాలు విమర్శలు మానుకుంటే మంచిదని మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌ అన్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఇళ్ల నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయని అన్నారు. అలాగే జంటనగరాల్లో అనేక ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణాలు సాగుతున్నాయని అన్నారు. విమర్శలు చేస్తున్న వారు ఆయా ప్రాంతాలకు వెళితే కళ్లకు కనిపిస్తాయని అన్నారు. నిలువ నీడలేని నిరుపేదల కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టింది. ఒక్క హైదరాబాద్‌ లోనే లక్ష ఇళ్లను నిర్మించాలని సంకల్పించింది. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు నగరవ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో శరవేగంగా డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణం జరుగుతోంది. అందులో భాగంగా గోషామహల్‌ నియోజకవర్గంలో ఇళ్లను నిర్మిస్తున్నారు. గోషా మహల్‌ నియోజకవర్గం లోని క్టటెలమండిలో దాదాపు 2 ఎకరాల స్థలంలో ఇళ్ల నిర్మాణం జరుగుతోంది. మొత్తం 10 బ్లాకుల్లో 128 డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లను నిర్మిస్తున్నారు. మొత్తం ఆరు పెద్ద బ్లాకులు, నాలుగు చిన్న బ్లాకులుగా విభజించి మూడు అంతస్థులుగా నిర్మాణాలు జరుగుతున్నాయి. అయితే ఇందులో 32 డబుల్‌ బెడ్‌ రూం ఇండ్ల విషయంలో న్యాయపరమైన చిక్కులు వచ్చాయి. దీంతో వాటిని వదిలి మిగతా ఇండ్లను పూర్తి చేస్తున్నరు. గతేడాది ప్రారంభమైన ఈ పనులు.. రాత్రింబవళ్లు, శరవవేగంగా జరుగుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో వచ్చేనెలలో పనులన్నీ పూర్తి చేయాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఇప్పటికే గోడల నిర్మాణం పూర్తయింది. ఇక మిగిలిన పనులను కూడా త్వరలోనే ప్రారంభించనున్నారు. ప్లాస్టరింగ్‌ తో పాటు గదుల్లో ప్లంబింగ్‌, విద్యుత్‌, డ్రైనేజీ పైప్‌ లైన్‌ పనులను కూడా మొదలు పెట్టనున్నారు. అదే సమయంలో నాణ్యతలో రాజీ లేకుండా అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. వచ్చే నెల నాటికి పనులన్నీ పూర్తి చేసుకొని.. గృహ ప్రవేశానికి ఈ ఇళ్లు సిద్ధం కానున్నాయి. ఇకపోతే సికింద్రాబాద్‌, సనత్‌ నగర్‌ నియోజకవర్గాల్లో కూడా జోరుగు సాగుతున్నాయని తలసాని అన్నారు.