Wednesday, 4 November 2026

జగన్‌తో రమణదీక్షితులు భేటీ

సమస్యలు చెప్పుకోవడానికే అన్న పూర్వ ప్రధానార్చకులు

హైదరాబాద్‌,జూన్‌7(జ‌నం సాక్షి): ఇటీవల తిరుమలలో అక్రమాలు జరిగాయంటూ ఆరోపణలు చేస్తూ వార్తల్లో ఉంటున్న తిరుమల పూర్వ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు గురువారం సాయంత్రం ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌తో సమావేశమయ్యారు. లోటస్‌పాండ్‌కు వెళ్లిన రమణ దీక్షితులు, జగన్‌తో మంతనాలు జరిపారు. టీటీడీలో అక్రమాలు జరుగుతన్నాయంటూ వరుసగా ఆరోపణలు చేస్తున్న క్రమంలో వీరి భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది. శుక్రవారం కోర్టుకు హాజరయ్యేందుకు ముందుగానే పాదయాత్రకు విరామిచ్చిన జగన్‌ గురువారం సాయంత్రం లోటస్‌పాండ్‌ చేరుకున్నారు. ఆ తర్వాత రమణ దీక్షితులు లోటస్‌పాండ్‌కు వచ్చారు. వీరిద్దరు ఏ విషయంపై చర్చించారనే దానిపై వైసీపీ వర్గాలు వెల్లడించలేదు. టీటీడీలో అవకతవకలు జరుగుతున్నాయని, 24 ఏళ్ల పాటు టీటీడీ ప్రధాన అర్చకులుగా పనిచేసిన రమణ దీక్షితులు కొద్ది రోజులుగా తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఓ వజ్రం మాయమైందని, తిరుమలలో తవ్వకాలు జరిగాయని దీక్షితులు ఆరోపించారు. దీంతో ఆలయ ప్రతిష్టను దిగజార్చుతున్నందుకు దీక్షితులుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని టీటీడీ నిర్ణయించింది. కొద్దిరోజుల క్రితం కర్నాటక ఎన్నికల ప్రచారం ముగించుకుని తిరుమలకు వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాతో దీక్షితులు మంతనాలు జరిపారు. ముందుగా చెన్నైలో ఆ తర్వాత ఢిల్లీలో ఈ తరహా ఆరోపణలు చేశారు. అప్పడే టీటీడీ ఆయనకు రిటైర్డ్‌మెంట్‌ ప్రకటించింది. ఆ తర్వాత కూడా దీక్షితులు ఆరోపణలపర్వం కొనసాగించారు. ఇప్పుడు నేరుగా జగన్‌తో దీక్షితుల భేటీ కావటం ఆసక్తి కలుగుతోంది. అయితే తన పోరాటానికి జగన్‌ మద్దతు కోరేందుకు రమణదీక్షితులు వచ్చారని చెబుతున్నారు. ఇటీవల తిరుమల శ్రీవారి ఆలయానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం, అధికారులపైనా తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తోన్న రమణదీక్షితులు ప్రతిపక్ష నేతను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే, వీరిద్దరి మధ్య ఏయే అంశాలపై చర్చ జరిగిందీ ఇంకా వెల్లడికాలేదు. జగన్‌తో భేటీ అనంతరం బయటకు వెళ్తూ.. తన సమస్యల్ని చెప్పుకొనేందుకు మాత్రమే ప్రతిపక్ష నేతను కలిశానంటూ రమణదీక్షితులు అక్కడి విూడియా ప్రతినిధులతో అన్నారు.