Wednesday, 4 November 2026

జగన్‌ పార్టీలో తెలంగాణకు తావు లేదు ప్రత్యేక రాష్ట్రం కావాలనుకునే వారు వైకాపాలోకి వెళ్లరు ఎంపీ మధుయాష్కీ

హైదరాబాద్‌, నవంబర్‌21:  అవినీతి, అక్రమాలకు మారుపేరైన జగన్‌ పార్టీలో తెలంగాణకు తావులేదని నిజామాబాద్‌ ఎంపీ మధుయాష్కీ గౌడ్‌ విమర్శించారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం కావాలనుకునే వారు ఎవరూ జగన్‌ స్థాపించిన వైఎస్సార్సీపీలోకి వెళ్లరని పేర్కొన్నారు. అలా వెళ్తే వారు తెలంగాణ ద్రోహులేని విమర్శించారు. వైకాపా పక్క తెలంగాణ వ్యతిరేక పార్టీ అని మండిపడ్డారు. ఆ పార్టీని తెలంగాణ ప్రజలు ఆదరించరని అన్నారు. తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు ఎవరూ వైకాపాలోకి వెళ్లరని, అవి అసత్య ప్రచారాలని తెలిపారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం తేవడానికి అవిశ్వాస తీర్మణాన్ని ఉపయోగించుకుంటామని చెప్పారు. తమ ప్రయత్నమంతా కూడా తెలంగాణ సాధన కోసమేనని తెలిపారు. ఇందులో ఎలాంటి సందేహం లేదని స్పష్టం చేశారు. తెలంగాణకు ప్యాకేజీలు, పదవులు అంటే సమస్యను నాన్చడమేనని పేర్కొన్నారు. సమస్యను త్వరగా పరిష్కరించమని అధిష్ఠానాన్ని కోరుతామన్నారు. పార్టీలను బలోపేతం చేసుకునేందుకు వైకాపా, టీఆర్‌ఎస్‌లు పాటు పడుతున్నాయని ఆరోపించారు. పార్టీలు మారితే ఆయా పార్టీలు బలోపేతం అవుతాయే తప్ప తెలంగాణ సమస్య పరిష్కారం కాదని ఆయన అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *